– కంచె చేను మేసింది అనే చందంగా పిఎస్సిఎస్ డైరెక్టర్
– ఇంట్లో 26 యూరియా బస్తాలు అక్రమంగా నిలువ
– ప్రశ్నించి.. అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు
– కేసు నమోదు చేసిన మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం
నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని తిర్మలాయపల్లి – గన్నారం గ్రామాలకు చెందిన రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకారక సంఘం డైరెక్టర్ కంచె చేను మేసింది అనే చందంగా యూరియా బస్తాలను పట్టపగలే దొంగిలించిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో రాయపర్తి పీఎస్సీఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిర్మలాయపల్లి – గన్నారం గ్రామాలకు చెందిన రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకారక సంఘం డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి ఎరువుల విక్రయ కేంద్రానికి బాధ్యత వహిస్తున్నారు. గత శనివారం 444 యూరియా బస్తాలతో లారీలోడు వచ్చింది. గ్రామానికి చెందిన హమాలీలు విక్రయ కేంద్రంలో అన్ లోడ్ చేశారు. వెంటనే వంకర బుద్ధి చూపెట్టిన డైరెక్టర్ యాదగిరి తన కుమారుడితో కలిసి తన బోలోరో వాహనంలో 26 యూరియా బస్తాలను వేసుకొని ఇంట్లో అక్రమంగా నిలువ చేశాడు.
ఈ తథాంగాన్ని చూసిన స్థానిక రైతులు ఆదివారం ఉదయం యూరియా బస్తాల కోసం విక్రయ కేంద్రం వద్ద పడికాపులు కాశారు. నిర్వాహకులు పైరవి దారులకే యూరియా బస్తాలు ఇస్తున్నారని ఆరోపించారు. అసహనానికి గురైన రైతులు డైరెక్టర్ యాదగిరి ఇష్టాను రీతిగా పట్టపగలే యూరియా బస్తాలను దొంగిలించి ఇంట్లో అక్రమంగా నిలువ చేసుకున్నాడని ముక్తకంఠంతో ఆరోపించారు. వెంటనే స్పందించిన వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం యాదగిరి ఇంట్లో చూడగా 26 యూరియా బస్తాలు ఉన్నాయని తెలిసింది. దాంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పిఎస్సిఎస్ డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి, రాయపర్తి పిఎస్సిఎస్ సీఈఓ సోమిరెడ్డి పై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
రైతులు యూరియా బస్తాలు సకాలంలో అందక అనేక ఇబ్బందులకు గురవుతుంటే రైతులకు సహకరించవలసిన పిఎస్సిఎస్ డైరెక్టర్ తన సొంత ప్రయోజనాల కోసం విక్రయ కేంద్రం నుండి యూరియా బస్తాలను దొంగిలించడం విస్మయానికి గురి చేస్తుందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు సైతం మొద్దు నిద్రలో ఉన్నట్లు వివరించడం నీచ సంస్కృతికి నిదర్శనమని రైతులు అంటున్నారు. యూరియా బస్తాలను దొంగిలించిన యాదగిరి పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులే అంటున్నారు. ఈ యొక్క ఫిర్యాదు పై రాయపర్తి ఎస్సై రాజేందర్ ను వివరణ కోరగా ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.