– కొరతతో రైతుల ఆందోళనలు
– అధికారులను నిర్బంధించిన సిద్దిపేట జిల్లా రైతులు
నవతెలంగాణ-విలేకరులు
యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు కష్టాలు పడుతున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునుంచే పీఏసీఎస్ కేంద్రాల వద్ద బారులు తీరుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా సరిపడా యూరియా అందకపోతుండటంతో రైతులు మండిపడు తున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ, అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన ఉండటం లేదు. దాంతో రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నల్లగొండ, నాంపల్లి, చండూరులోని వ్యవసాయాధికారి కార్యాలయాల ఎదుట సీపీఐ(ఎం), రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.
నిడమూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దామరచర్లలోని రైతువేదిక వద్ద ధర్నా నిర్వహించారు. కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదురుగా రైతులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్‌ఎస్ నాయకులు నిరసనకు దిగారు.
సిద్దిపేటలో అధికారులను నిర్బంధించిన రైతులు
సిద్దిపేట జిల్లా కొండపాక పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేయడం కోసం లారీ యూరియా వచ్చిందని తెలియడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు కొండపాక, కుకునూరుపల్లి చేరుకున్నారు. యూరియా పంపిణీ కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా అందరికీ అందకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న వ్యవసాయ శాఖ అధికారి శివరామకృష్ణ, మరో నలుగురు వ్యవసాయ విస్తరణ అధికారులను కార్యాలయంలో నిర్బంధించారు. తమకు సరిపడా యూరియా అందిస్తేనే బయటకు పంపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే యూరియా అందిస్తామని చెప్పడంతో శాంతించారు.
టోకెన్ల కోసమూ క్యూ
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని సహకార కేంద్రానికి సోమవారం 700 బ్యాగుల యూరియా రావడంతో సుమారు 500 మంది రైతులు బారులు తీరారు. వీరిలో సగం మందికే యూరియా బస్తాలు అందాయి. వీరంతా రెండు రోజుల క్రితం టోకెన్లు తీసుకున్నవారే. కాగా, సహకార కేంద్రం వద్ద టోకెన్లకు ఒక లైన్, యూరియాకు ఒక లైన్ ఏర్పాటు చేశారు. వీటి కోసం కూడా గంటల తరబడి క్యూలో వేచిచూడాల్సి వస్తోంది. ఈ రోజు టోకెన్ తీసుకుంటే రెండ్రోజుల తర్వాత వారికి యూరియా అందుతున్నది. షాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఉదయం 8 గంటల నుంచే రైతులు బారులు తీరారు. వృద్ధులు, మహిళా రైతులు సైతం గంటల తరబడి వేచి చూశారు. నీరసం వచ్చి పడుకుని కూడా ఎరువుల కోసం వేచి చూశారు. పదిన్నర తర్వాత వ్యవసాయ అధికారులు వచ్చి రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. కొందరు రైతులకు యూరియా టోకెన్ అందలేదు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో తెల్లవారు జామున నుంచే మహిళలు, పురుషులు క్యూ లైన్‌లో నిలబడి నిరసించి పోయారు.
యూరియా కష్టాలు.. రైతుల పడిగాపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES