Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూడో డిస్కం ఏర్పాటుకు వేగంగా చర్యలు

మూడో డిస్కం ఏర్పాటుకు వేగంగా చర్యలు

- Advertisement -

సీఎండీగా ముషారఫ్‌ అలీ నియామకం
కొత్త డిస్కం పరిధిలో 29 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు
2 వేల మంది ఉద్యోగుల కేటాయింపు
ఏప్రిల్‌ 1 నుంచి మనుగడలోకి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగా గురువారం మూడో డిస్కం సీఎండీని ప్రభుత్వం నియమించింది. విద్యుత్‌ రంగంలో అనుభవమున్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీకి బాద్యతలు అప్పగించింది. పాత డిస్కంల నెట్‌వర్క్‌తోనే కొత్త డిస్కం తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ పథకాలను దీని పరిధిలోకి రానున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో మూడో డిస్కం మనుగడలోకి రానుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలున్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) 15 జిల్లాలకు, ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) 18 జిల్లాలకు సేవలందిస్తోంది. రెండు డిస్కంలపై భారం తగ్గించడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ లక్ష్యంగా మూడో డిస్కం ఏర్పాటు చేస్తున్నట్టు సర్కార్‌ వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో జీవో నెంబర్‌ 44 ద్వారా కొత్త డిస్కం ఏర్పాటు సందర్భంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఆస్తులు, అప్పులు, విద్యుత్‌ కనెక్షన్ల బదిలీని నిర్ణయించింది.

రూ.4,929 కోట్ల ఆస్తులు బదిలీ
కొత్త డిస్కం పరిధిలోకి రూ.4,929 కోట్ల ఆస్తులు, 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 489 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, 99 వాటర్‌బోర్డులు, 1,132 మిషన్‌ భగీరథ కనెక్షన్లు బదిలీ కానున్నాయి. రెండు డిస్కంల పరిధిలో 5,22,479 వ్యవసాయ డీటీఆర్‌లు ఉండగా, 2,61,240 కిలోమీటర్ల మేర వ్యవసాయ ఎల్‌టీ(లోటెన్షన్‌) లైన్లు ఉన్నాయి. డీటీఆర్‌ల ఖరీదు రూ.2,792 కోట్లు కాగా, ఎల్‌టీ లైన్ల విలువ రూ.2,137 కోట్లుగా ఉంటుంది. కొత్త డిస్కం పరిధిలోని ప్రతి డీటీఆర్‌కు స్మార్ట్‌మీటర్‌ బిగించనున్నారు.

ఒక్కో మీటర్‌కు రూ.25 వేలు అవుతాయని అంచనా వేసి, మొత్తంగా 5,22,479 వ్యవసాయ డీటీఆర్‌లకు రూ.1,306 కోట్లు అవుతాయని లెక్కతీశారు. ఎత్తిపోతల పథకాలు, వాటర్‌ బోర్డు, మిషన్‌ భగీరథ కనెక్షన్లకు మీటర్లు ఉండటంతో వీటి వినియోగాన్ని ఇప్పటికే లెక్కిస్తున్నారు. అయితే 29 లక్షలుగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లు ఏ మేరకు కరెంట్‌ వినియోగిస్తున్నాయో వాటికి కరెంట్‌ను సరఫరా చేసే డీటీఆర్‌లోని స్మార్ట్‌మీటర్లు కచ్చితంగా లెక్కించనున్నాయి. దాంతో మీటర్‌ రీడింగ్‌ కోసం నేరుగా డీటీఆర్‌ వద్దకు వెళ్లకుండానే స్మార్ట్‌ఫోన్లలో సమాచారం రికార్డు కానుంది.

తెలంగాణ కిసాన్‌ డిస్కం
కొత్త డిస్కంకు ‘తెలంగాణ కిసాన్‌ డిస్కం’గా నామకరణం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను విద్యుత్‌ శాఖ ఇప్పటికే చేపట్టింది. అలాగే దీని నిర్వహణ కోసం సిబ్బంది కేటాయింపుపై కసరత్తు ప్రారంభించారు. రెండు డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్‌ సిబ్బందిని విభజించి 2వేల మందిని కొత్త డిస్కంకు కేటాయిస్తారు. ఇందులో 660 మంది ఇంజనీర్లు, 1,000 మంది ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ సిబ్బంది, 340 మంది పాలనాపరమైన సిబ్బంది ఉంటారు.

ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ మొత్తం మూడో డిస్కం పరిశీలిస్తుంది. రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్‌కో), కేంద్ర విద్యుత్‌ సంస్థలు, స్వతంత్ర విద్యుత్‌ సంస్థలతో పాటు పలు రకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు ప్రస్తుతం ఎస్పీడీసీఎల్‌కు 70.55 శాతం, ఎన్పీడీసీఎల్‌కు 29.45 శాతం ఉన్నాయి. స్థానిక అవసరాలు, ఐదేళ్ల విద్యుత్‌ వినియోగ సగటు ఆధారంగా పీపీఏలను మూడో డిస్కం పరిధిలోకి రానున్నాయి.

ఉచితాలన్నీ..
ప్రభుత్వ ఉచిత పథకాలన్ని కొత్త డిస్కం పరిధిలోకి రానున్నాయి. వ్యవసాయ ఉచిత విద్యుత్‌, మిషన్‌ భగీరథ, ఎత్తిపోతల పథకాలు, మున్సిపల్‌ వాటర్‌ సప్లైకి సంబంధించిన కనెక్షన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విద్యుత్‌ కనెక్షన్లు కొత్త డిస్కంకు బదలాయిస్తారు. రెండు డిస్కంల పరిధిలోని వ్యవసాయ విద్యుత్‌ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లపై మూడో డిస్కంకు పూర్తి అధికారాలు ఉంటాయి. నిర్వహణ, పెట్టుబడి వ్యయానికి మూడో డిస్కం అప్పు చేయాల్సి ఉంటుంది. ఉచిత పథకాలన్నీ మూడో డిస్కంకు బదలాయించడంతో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలు లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించడంపై మూడో డిస్కం మనుగడ అధారపడి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -