Wednesday, December 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినైజీరియాపై అమెరికా దాడి : పశ్చిమాఫ్రికాపై పట్టుకోసమే!

నైజీరియాపై అమెరికా దాడి : పశ్చిమాఫ్రికాపై పట్టుకోసమే!

- Advertisement -

శాంతి, మానవాళి అభ్యున్నతి కోరుకోవటానికి జరుపుకొనే క్రిస్మస్‌ రోజు డోనాల్డ్‌ ట్రంప్‌ కొంత మంది ప్రాణాలు తీయించాడు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని వాయువ్య ప్రాంతంపై అమెరికా వైమానిక, క్షిపణి దాడులు చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇస్లామిక్‌ రాజ్య ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పుకుంది. క్రిస్మస్‌ రోజున జరిగిన ఈ దాడిలో ఎందరు మరణించారు, వారిలో ఉగ్రవా దులెందరు, గొర్రెలు, మేకలు, పశువుల కాపరులెం దరు అనేది తెలియదు. ఇలా అమాయకులపై దాడులు చేసి, హత మార్చటం ద్వారా ఇస్లామిక్‌ రాజ్య ఉగ్రమూకలు మరింతగా రెచ్చిపోయేందుకు ట్రంప్‌ దోహదం చేసినట్లు కొందరు భావిస్తున్నారు. నైజీరియాలోని క్రైస్తవులపై జరుపుతున్న మారణ కాండకు ఇది ప్రతీకారమని, క్రిస్మస్‌ కానుక అని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. నోబెల్‌ శాంతి బహుమతి కావాలంటూ నానా యాగీ చేసిన ఆ పెద్దమనిషి నాయకత్వంలో ఇది తొమ్మిదో దేశంపై జరిగిన దాడి అని వార్తలొచ్చాయి. ఇప్పటివరకు ఏ అధ్యక్షుడి హయాంలోనూ ఇన్నిదేశాల మీద దాడులు జరగలేదు. నైజీరియాలో ఉగ్రవాద మూకలు దశాబ్దాలు గా మారణకాండకు పాల్పడుతున్నమాట నిజం. వారికి మతం లేదు. పోనీ క్రిస్మస్‌కు ముందు పెద్ద ఉదంతం జరిగి క్రైస్తవులను హతమార్చారా అంటే అదీ లేదు. మరెందుకు దాడి చేయించి నట్లు? గత కొంతకాలంగా నైజీరియాలో క్రైస్తవులను ఊచకోత కోస్తున్నారంటూ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కొందరు మతరాజ కీయం చేసే ఎంపీలు, క్రైస్తవ మత సంస్థలు, వాటికి మద్దతిచ్చే ఫాక్స్‌ న్యూస్‌ వంటి మీడియా సంస్థలు పనిగట్టుకొని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయి. ఏమతం కూడా అమాయకులను చంప మని చెప్పలేదు. కానీ ఆ పేరుతో ప్రపంచంలో మారణకాండలు సాగాయి. హిట్లర్‌ యూదులను ఊచకోతకోశాడు. అనేక దేశాల్లో యూదులు ఊచకోతకు గురయ్యారు. ఇజ్రాయిల్‌లో యూదు మతస్తులపై పాలస్తీనాకు చెందిన హమాస్‌ సాయుధులు దాడి చేసి 1,195 మందిని హత్యచేసి 251మందిని బందీలుగా పట్టుకుపోయారు. దాన్ని సాకుగా చూపుతూ పశ్చిమదేశాల మద్దతుతో ఇజ్రాయిల్‌ 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు పాలస్తీనియన్లను ఊచకోత కోస్తూనే ఉంది. దాదాపు 70వేల మంది మరణించగా వారిలో సగానికి పైగా అమాయ కులైన మహిళలు, పిల్లలే ఉన్నారు, మరో 1,71,000 మంది గాయపడ్డారు. వేలాది మంది జాడతెలియటం లేదు, లక్షలాది ఇండ్లను కూల్చివేశారు. మన కళ్ల ముందు జరుగుతున్న మారణకాండ ఇది.

సామ్రాజ్యవాదుల కుట్రలో భాగమే దాడులు
నైజీరియాలో అలాంటి ఉదంతాలేమైనా జరి గాయా? మతపరమైనదైనా, మరొక ఉగ్రవాదమైనా అది ఆయా దేశాల అంతర్గత సమస్య. ఎవరికి వారు తేల్చుకోవాల్సిన అంశం. ఉగ్రవాద అణచివేతకు అమె రికాకు ఎవరు అధికారమిచ్చారు? నైజీరియాలో మత ప్రాతి పదికన ఉగ్రదాడులు జరగటం లేదు, అనేక కారణా లున్నాయి. అలాంటపుడు క్రైస్తవుల రక్షణ పేరుతో జరిపేదాడులు ఆ సామాజిక తరగతిని మరింతగా లక్ష్యం చేసుకొనేం దుకే తోడ్పడతాయి. లేని ఆలోచన కలిగించటం తప్ప మరొకటి కాదు. ప్రపంచంలో ఆరవ పెద్ద దేశంగా ఇరవై మూడు కోట్ల మంది జనాభా ఉన్న నైజీరియా లో 56శాతం మంది ముస్లింలు 43శాతం క్రైస్తవులు. ఉత్తర ప్రాంతంలో ముస్లింలు కేంద్రీకృతం కాగా దక్షిణ ప్రాంతంలో ముస్లింలు ఉన్నారు. మనదేశంలో ఒకే మతంలో వివిధ కులాలు ఉన్నట్లే అక్కడ రెండు మతాల్లోనూ తెగలవారీ విభజన ఉంది. బోకో హారమ్‌, ఐసిస్‌ వంటి ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయి. అవి రెండు మతాలకు చెందిన వారినీ హత మారుస్తున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారని అనేక గణాంకాలు వెల్లడి స్తున్నాయి. ఉగ్రవాద చర్యలు, పశువుల కాపరులు -రైతాంగం మధ్య, పశువులను మేపుకోవటం దగ్గర తలెత్తిన వివాదాలు, బందిపోట్ల చర్యలు, హత్యలు అక్కడ సర్వసాధారణం. వాటిలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారు తప్ప క్రైస్తవుల ఊచకోత అనేది ఒక సాకు మాత్రమే, దానికి ఎలాంటి ఆధారాలు లేవని అనేక విశ్లేషణలు వెల్లడించాయి. అక్కడి జనాభా తీరుతెన్నులను చూసినపుడు ఒక మతం వారిపై మరొక మతం లేదా రాజ్యమే పనిగట్టుకొని ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు, అలాంటి అవకాశాలు కూడా లేవు. నైజర్‌ నది ప్రవహిస్తున్న కారణంగా బ్రిటీష్‌ వారు తమ వలసగా ఉన్న ఆ ప్రాంతానికి 1897 నైజీరియా నామకరణం చేశారు. సహజ సంపదలు, పరిసర దేశాలను అదుపులో ఉంచుకొనేందుకు, ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా ప్రభావాన్ని అడ్డుకొనేందుకు అమెరికా సామ్రాజ్య వాదులు పన్నిన కుట్రలో భాగంగానే క్రిస్మస్‌ రోజు ట్రంప్‌ సేనల దాడులు జరిగాయి.

ఖనిజ సంపదను దోచుకునేందుకే…
నైజీరియాలో అమెరికాకు అవసరమైన విలువైన ఖనిజాలు ఉన్నాయి, చమురు నిల్వలు కూడా ఉన్నసంగతి తెలిసిందే. ఉగ్రవాదులను నిరోధించటంలో అక్కడి ప్రభుత్వాలు విఫలం చెందాయి. అధికారంలోకి వచ్చిన పాలకులందరూ ‘నీకిది నాకది’ అంటూ ఆశ్రితులతో కలసి దేశ సంపదలను పంచుకొనేవారే తప్ప జన సంక్షేమాన్ని గాలికి వదిలారు.దాన్ని అవకాశంగా తీసుకొని అక్కడి పాలకుల మద్దతుతోనే అమెరికా రంగంలోకి దిగి సహజసంపదలను స్వంతం చేసుకొనేందుకు ఉగ్రవాదాన్ని ఒక ముసుగుగా చేసుకుందన్నది స్పష్టం. తాజాదాడులకు ప్రభుత్వం కూడా మద్దతిచ్చిందని వార్తలొచ్చాయి. నైజీరియా పొరుగు దేశమైన నైజర్‌లో యురేనియం ఖనిజ వెలికితీతలో రష్యా ఉంది. ఆఫ్రికాలోని విలువైన ఖనిజాల్లో 30శాతం నైజీరియాలో ఉన్నాయి. ఆఫ్రికా ప్రాంతాన్ని వలసగా చేసుకున్న ఫ్రెంచి, అమెరికా ప్రోత్సహించిన పాలకులను అనేక దేశాలలో మిలిటరీ తిరుగుబాట్లతో వదిలించుకొని పశ్చిమదేశాల ప్రభావం నుంచి బయటపడేందుకు పూనుకున్నారు. ఇటీవల చైనా తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ కార్యక్రమంలో భాగంగా ఆఫ్రికా దేశాలలో పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. బ్రిక్స్‌ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిన నైజీరియాను అడ్డుకొనేందుకు అమెరికా రంగంలో దిగిందని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో బుర్కినాఫాసో, మాలి, నైజర్‌ దేశాలు ఒక సమాఖ్యగా ఏర్పడి ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు పూనుకున్నాయి, దాన్లో భాగంగానే ఒక మిలిటరీ బెటాలియన్‌ ఏర్పాటును ప్రకటించాయి. ఈ కూటమికి రష్యా మద్దతు ఉంది. ఈ పరిణామంతో ఎక్కడ చొరవ వాటి చేతిలోకి పోనుందో అనే ఆతృతతో అమెరికా దాడులు జరిపింది. అంతేకాదు అమెరికాలోని మతవాద క్రైస్తవుల మద్దతు పొందేందుకు, అమెరికాను మరోసారి గొప్పగా చేయాలన్నవారి ప్రశంసలు అందుకొనేందుకు, 2026 నవంబరులో జరగనున్న పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా కూడా ఈదాడులను ఉద్దేశించినట్లు భావిస్తున్నారు. ఈ పూర్వరంగంలో నైజీరియా పాలకులు ఎందుకు వాషింగ్టన్‌తో చేతులు కలుపుతున్నారంటే జూనియర్‌ భాగస్వామిగా ప్రాంతీయంగా పెత్తనం సాగించాలని తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు తెరవెనుక ఉండి రాజకీయం చేస్తున్న వాషింగ్టన్‌ నేరుగా రంగంలోకి దిగింది. ఇదంతా సామ్రాజ్యవాద ప్రాజెక్టులో భాగమే.మొదటిసారి అధికారానికి వచ్చినపుడు 2017 నుంచి దిగిపోయే వరకు తిరిగి రెండవసారి పదవి చేపట్టిన తరువాత డోనాల్డ్‌ ట్రంప్‌ ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, లిబియా, పాకిస్తాన్‌, సోమాలియా, సిరియా, ఎమెన్‌, తాజాగా నైజీరియా మీద దాడులు చేయించాడు. వెనిజులా మీద యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. గతంలో జార్జి డబ్ల్యు బుష్‌ ఐదు, బరాక్‌ ఒబామా ఏడు దేశాల మీద దాడులు చేయిస్తే ”శాంతి దూత” డోనాల్డ్‌ ట్రంప్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఉగ్రవాదం మీద పోరు పేరుతో అమెరికా చేయించిన దాడుల్లో 4,32,000 మంది పౌరులతో సహా 9,40,000 మంది మరణించినట్లు బ్రౌన్‌ విశ్వవిద్యాలయం యుద్ధ ఖర్చు అనే పరిశోధనలో వెల్లడించింది.

అధికార యంత్రాంగంలో అవినీతి
2009లో ఏర్పడిన బోకో హరామ్‌ అనే సంస్థ సున్నీ తెగ ముస్లింలను ”శుద్ధి” చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించుకుంది. నైజీరి యా ఉత్తర ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నందున అక్కడే కేంద్రీకరించి అనేక దాడులు చేసింది.వాటిలో పెద్ద సంఖ్యలో పెద్దలు, పిల్లలు మరణించారని, లక్షలాది మంది నిరాశ్ర యులైనట్లు అంచనా, అనేక ప్రాంతాలను ఆక్రమించి ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నది. దాని బాధితులలో ఎక్కువ మంది ముస్లింలే. క్రైస్తవులు కూడా ఉన్నారు. మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నవారిని ఊచకోత కోసింది, ముస్లిం లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్లను దగ్ధం చేసింది. ఈ క్రమంలోనే ఆప్రాంతాల్లో ఉన్న చర్చ్‌లను కూల్చివేసింది, క్రైస్తవులపై కూడా దాడులు చేసింది. వాటికి మతంతో సంబంధం లేదు. 2025లో పౌరులపై దాడులు జరిగిన ఉదంతాలు 1,923 ఉంటే వాటిలో కేవలం యాభై ఘటనల్లో మాత్రమే క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ జరిగినట్లు చెబు తున్న మరణాలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం లేదు. పశువుల కాపరులు- రైతుల మధ్య నిరంతరం ఘర్షణలు జరగటం ఒక సాధారణ అంశం. వాటిలో మరణాలు పెద్ద సంఖ్యలో సంభవిస్తున్నాయి. బందిపోట్ల దాడులను కూడా ఉగ్రవాద దాడులుగా అమెరికా చిత్రిస్తున్నది. అధికార యంత్రాం గంలో విపరీతమైన అవినీతి కారణంగా ఉగ్రవాదులకు అధి కారులే ఆయుధాలను అక్రమ పద్ధతుల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.2023లో అధికారానికి వచ్చిన అధ్యక్షుడు టినుబు ఇప్పటివరకు 13,500 మంది ఉగ్రవాదులను హత మార్చినట్లు ప్రకటించాడు. ఇదే కాలంలో 10,217 మంది ఉగ్రవాద సంబ ంధ దాడులలో మరణించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ చెప్పింది.

నిజానికి అమెరికా ఐసిస్‌ మీద దాడులు చేయటం కొత్తకాదు. బరాక్‌ ఒబామా 2014లోనే ఇరాక్‌, సిరియాల్లో ప్రారంభించాడు. అప్పటి నుంచి దాని కార్యకలాపాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు.అయినప్పటికీ 2018లో దాని మీద విజయం సాధించినట్లు ట్రంప్‌ గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు తిరిగి నైజీరియాలో దాడులు చేయించటం వెనుక అతగాడి బూతు పురాణాలను వెల్లడించే ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌ను ధ్వంసం చేయిం చాడనే అంశం బయటపడటంతో జనాలను పక్కదారి పట్టిం చేందుకు చూశాడని సోషల్‌ మీడియా కోడై కూస్తున్నది. నైజీరి యాలో 2011 నుంచి వివిధ ఉదంతాల్లో లక్షమందికి పైగా మరణించారని, ఒక్క 2025లోనే 8వేల మంది ఉన్నట్లు ఒక అంచనా. నిజానికి మానవత్వం గురించి మాట్లాడే ట్రంప్‌ ఇప్పుడే ఎందుకు మేలుకున్నట్లు ? క్రైస్తవులవి తప్ప ముస్లింలవి ప్రాణాలు కావా? అమెరికా అందించే మానవతా పూర్వక సాయాన్ని ట్రంప్‌ నిలిపివేయించాడు. ఫలితంగా అనేక మంది నైజీరియన్లు సరైన వైద్యం అందక మరణించారు. ఇది ఉగ్రవాదం కాదా?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -