Wednesday, March 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమూడు పడవలపై అమెరికా దాడులు

మూడు పడవలపై అమెరికా దాడులు

- Advertisement -

11 మంది మృతి : యూఎస్‌ మిలిటరీ

వాషింగ్టన్‌ : లాటిన్‌ అమెరికా సముద్ర జలాల్లో డ్రగ్స్‌ రవాణాకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో మూడు పడవలపై యూఎస్‌ మిలిటరీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 11 మంది మరణించారు. ఈ విషయాన్ని అమెరికా సైన్యం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. సోమవారం ఈ దాడులు జరిగినట్టు వివరించింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న డ్రగ్‌ వ్యతిరేక సైనిక చర్యల్లో ఇది అత్యంత ప్రాణనష్టం జరిగిన ఘటనల్లో ఒకటని అధికారులు పేర్కొన్నారు. కాగా తాజా దాడులతో.. గత సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి చిన్న పడవలలో ప్రయాణించే ‘నార్కో టెర్రరిస్టులు’గా అభివర్ణిస్తున్న వారిపై చేపట్టిన చర్యల్లో మరణించినవారి సంఖ్య కనీసం 145కు చేరిందని సైన్యం వివరించింది.

గతంలో జరిగిన 42 దాడులలాగానే.. ఈ సారి కూడా స్మగ్లింగ్‌ జరుగుతున్నట్టు గుర్తించిన మార్గాల వెంబడి లక్ష్యాలను ఎంచుకున్నట్టు యూఎస్‌ సదరన్‌ కమాండ్‌ తెలిపింది. కాగా డ్రగ్స్‌ ఆరోపణల పేరుతో అమెరికా చేస్తున్న ఈ దాడులపై అనేక అనుమానాలు ఉన్నాయి. లాటిన్‌ అమెరికా జలాల్లో పట్టు సాధించడం కోసం యూఎస్‌ సైన్యం ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. డ్రగ్స్‌ రవణా చేస్తున్న పడవలపై దాడులు చేశామని చెప్తున్న యూఎస్‌ అధికారులు.. అసలు ఆ పడవలు నిజంగానే డ్రగ్స్‌ను తరలిస్తున్నాయన్న విషయానికి సంబంధించి ప్రత్యక్ష ఆధారాలను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. అయితే దాడుల్లో పడవలు పూర్తిగా ధ్వంసమవుతున్న వీడియోలను మాత్రం యూఎస్‌ సైన్య విడుదల చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -