శ్వేత జాతీయులపై వివక్ష, హింస జరుగుతోందన్న ట్రంప్
అలాంటిదేమీ లేదంటున్న దక్షిణాఫ్రికా
వాషింగ్టన్ : దక్షిణాఫ్రికాలో జరిగే జీ-20 సదస్సుకు తమ అధికారులెవ్వరూ హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. శ్వేత జాతీయులైన రైతుల విషయంలో దక్షిణాఫ్రికా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నేతలు ఈ నెల 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రియాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో సమావేశమవుతారు. దీనికి తాను హాజరు కావడం లేదని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరు కావచ్చునని ట్రంప్ గతంలో చెప్పారు. అయితే వాన్స్‌తో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడారు. దక్షిణాఫ్రికాలో జరిగే జీ-20 సదస్సుకు వాన్స్ వెళ్లడం లేదని ఆయన తెలియజేశారు.
ట్రంప్ ఏమన్నారంటే…
‘దక్షిణాఫ్రికాలో జీ-20 సదస్సు జరగడం పూర్తిగా అవమానకరం. డచ్, ఫ్రెంచ్, జర్మన్ సెటిలర్ల వారసులైన ఆఫ్రికన్లను చంపేస్తున్నారు. వారి భూములు, వ్యవసాయ క్షేత్రాలను చట్టవిరుద్ధంగా జప్తు చేస్తున్నారు’ అని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదికలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినంత కాలం అమెరికా నేతలు, అధికారులెవ్వరూ దక్షిణాఫ్రికాలో జరిగే సదస్సులకు హాజరు కాబోరని చెప్పారు. వచ్చే సంవత్సరం ఫ్లోరిడాలోని మియామీలో జీ-20 సదస్సును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దక్షిణాఫ్రికాను జీ-20 నుంచి తొలగించాలని ఈ వారం ప్రారంభంలో మయామీలో చేసిన ప్రసంగంలో ఆయన డిమాండ్ చేశారు.
శ్వేత జాతీయులైన మైనారిటీ రైతుల పట్ల జరుగుతున్న వివక్ష, హింసను దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెనకేసుకొ స్తోందని ట్రంప్ ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తోంది. దేశంలోకి శరణార్థుల ప్రవేశాన్ని 7,500కు తగ్గించిన అమెరికా ప్రభుత్వం వారిలో శ్వేత జాతీయులైన దక్షిణాఫ్రికా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో బహిష్కరించారు. వైవిధ్యం, సమ్మిళితం, వాతావరణ మార్పులపై దృష్టి సారించిన ఆ సమావేశపు అజెండాపై రుబియో అభ్యంతరం వ్యక్తం చేశారు.
హింసకు ఆధారాలు లేవు
అమెరికా నిర్ణయంపై దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది. సదస్సు విజయం ఏ ఒక్క సభ్య దేశం పైనో ఆధారపడి ఉండదని విదేశాంగ ప్రతినిధి క్రిస్‌పిన్ ఫిరి వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాలో ఒకప్పటి వలస పాలన యొక్క బాధామయ చరిత్రను ట్రంప్ ప్రస్తావిస్తూ సంక్షోభాన్ని ఊహించుకుంటున్నారని చెప్పారు. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులపై హింస జరుగుతోందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అమెరికా లేకుండానే సదస్సును నిర్వహిస్తామని తెలిపారు.
వర్ణ వివక్ష ముగిసిన తర్వాత మూడు దశాబ్దాలుగా నల్ల జాతి దక్షిణాఫ్రికా ప్రజల కంటే శ్వేత జాతి పౌరులే చాలా మంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని దక్షిణాఫ్రికా తెలిపింది. శ్వేత జాతి రైతులను ఓ పథకం ప్రకారం హింసిస్తున్నారంటూ వచ్చిన నివేదికలు పూర్తిగా తప్పుడువని ట్రంప్‌కు తెలియజేశానని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా చెప్పారు. దక్షిణా ఫ్రికాలో మారణహోమం జరుగు తోందని ఆ దేశానికి చెందిన ఏ ఒక్క రాజకీయ పార్టీ చెప్పడం లేదు. ఆఫ్రికన్లకు, శ్వేత జాతీయు లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు కూడా అలాంటిదేమీ లేదని చెబుతున్నాయి.



