కౌలాలంపూర్ : అమెరికా, చైనా దేశాలకు చెందిన అధికారులు శనివారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో వాణిజ్య చర్చలు ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు వారు ప్రయత్నిస్తారు. దక్షిణ కొరియాలో వచ్చే వారం జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు సందర్భంగా అమెరికా, చైనా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ సమావేశమవుతున్న విషయం తెలిసిందే. దానికి సన్నాహకంగా ప్రస్తుతం అధికారుల స్థాయి చర్చలు జరుగుతున్నాయి. చైనా ఉత్పత్తులపై ట్రంప్ తాజాగా 100 శాతం సుంకాలు విధించారు. ఇవి నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. దీనికి ప్రతిగా చైనా రేర్ ఎర్త్ మాగేట్లు, ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అనేక చైనా సంస్థలను అమెరికా ఇప్పటికే బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఈ చర్యల కారణంగా అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్, వాణిజ్య ప్రతినిధులు గ్రీర్, చైనా ఉప ప్రధాని లిఫెంగ్ మధ్య మే నుంచి నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి కన్పించలేదు. తాజా చర్చల్లో చైనాకు చెందిన కీలక వాణిజ్య ప్రతినిధి చెన్‌గాంగ్ కూడా భాగస్వామి అయ్యారు.
ప్రపంచంలో అత్యంత పొడవైన రెండో భవనం మార్డెకా 118వ టవర్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంపై మలేసియా ప్రభుత్వం కానీ, రెండు దేశాల ప్రతినిధులు కానీ పెద్దగా వివరాలేవీ అందించలేదు. వచ్చే గురువారం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరిగే సమావేశానికి ప్రస్తుత చర్చలు మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు. కాగా జిన్‌పింగ్‌తో తాను జరిపే చర్చల్లో అమెరికా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, తైవాన్ తదితర అంశాలను ప్రస్తావిస్తా నని ట్రంప్ తెలిపారు. ఆసియా పర్యటనకు బయలు దేరడానికి ముందు ఆయన శుక్రవారం రాత్రి విలేకరు లతో మాట్లాడుతూ తైవాన్ వెళ్లే ఆలోచన ఏదీ లేదని చెప్పారు. ఆయన మలేసియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటిస్తారు.



