రూ.9వేల కోట్లు చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ : కోవిడ్ సమయంలో ఓ వెలుగువెలిగిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్, ఆ సంస్థ ఫౌండర్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. బైజూస్ ఆల్ఫాపై అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్‌ట్రస్ట్ కంపెనీ ఎల్‌ఎల్‌సి దాఖలు చేసిన పిటిషన్‌పై అమెరికా కోర్టు వాదనలకు వీలు లేకుండా డిఫాల్ట్ తీర్పును వెలువరించింది. పిటిషనర్లకు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9వేల కోట్లు) వ్యక్తిగతంగా చెల్లించాలని బైజూస్ రవీంద్రన్‌ను ఆదేశిస్తూ నవంబర్ 20న తీర్పు వెలువరించింది. తమ తీర్పును రవీంద్రన్ ఉల్లంఘించడం, పట్టించుకో కపోవడంతో ఈ ఆదేశాలు ఇస్తునట్లు డెలావేర్ దివాలా పరిష్కార కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ ఆదేశాలను బైజూస్ రవీంద్రన్ తోసిపుచ్చారు. అప్పీల్‌కు వెళతామని పేర్కొన్నారు. కోర్టులో వాదనలు వినిపించేం దుకు తమకు అవకాశం ఇవ్వలేదని బైజూస్ తరఫు లాయర్లు తెలిపారు. బైజూస్ పేరిట సేవలందిస్తున్న సమయంలోనే బైజూస్ ఆల్ఫాను 2021లో నెలకొల్పారు.
అంతర్జాతీయ రుణదాతల నుంచి నిధుల సమీకరించే ఉద్దేశంతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. దీనిద్వారా బైజూస్ ఆల్ఫా 1 బిలియన్ టర్మ్‌లోన్‌ను బైజూస్ పొందింది. కాగా.. బైజూస్ ఆల్ఫా టర్మ్‌లోన్ నిబంధనలను ఉల్లంఘించిందని, మొత్తం అప్పులో 533 మిలియన్ డాలర్లు (రూ.4,777 కోట్లు) అమెరికా నుంచి చట్టవిరుద్ధంగా తరలించినట్లు రుణదాతలు ఆరోపించారు. దీనిపై గ్లాస్‌ట్రస్ట్ డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో బైజూస్ ఆల్ఫాను స్వాధీనం చేసుకునేందుకు గ్లాస్ ట్రస్ట్‌కు కోర్టు అనుమతించింది. దీనిపై రవీంద్రన్ స్పందించలేదు. దీంతో బైజూస్ ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్ 533 మిలియన్ డాలర్లకు సంబంధించిన నిధుల లావాదేవీల కోసం మరోసారి కోర్టును ఆశ్రయించాయి. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే రవీంద్రన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన కోర్టు.. తాజాగా డిఫాల్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఆల్ఫా ఫండ్లను ఎలా ఖర్చు చేశారో.. పూర్తి వివరాలను లెక్కలు సమర్పించాలని ఆదేశించింది.



