జెనీవా : అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో రెండో విడత అణు చర్చలు మంగళవారం ప్రారంభమయ్యాయి. నగరంలోని ఒమానీ మ్యూజియంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్చలు సాగుతున్నాయి. ఇరాన్ ఒప్పందాన్ని కోరుకుంటోందని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విలేకరులకు చెప్పారు. తమ అణు కార్యక్రమంపై అమెరికా వైఖరి వాస్తవాలకు దగ్గరగా ఉన్నదని ఇరాన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఒమన్ మధ్య వర్తిత్వంతో జరుగుతున్న ఈ చర్చలు తమ అణు కార్యక్రమం పైన, అమెరికా విధించిన ఆంక్షల ఎత్తివేత పైన దృష్టి సారిస్తాయని తెలిపింది. ఇరాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై కూడా చర్చించాల్సి ఉన్నదని అమెరికా గతంలో తెలిపింది.
దాని కంటే మా ఆయుధమే శక్తివంతం : ఖమేనీ
ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు చాలా ముఖ్యమైనవని ట్రంప్ తెలిపారు. వీటిలో తాను పరోక్షంగా భాగస్వామిని అవుతానని చెప్పారు. అణు కార్యక్రమంపై కఠిన వైఖరితో ఉంటే ఏం జరుగుతుందో ఇరాన్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. కాగా సైనిక చర్యపై ట్రంప్ బెదిరింపులను ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ మంగళవారం ప్రస్తావిస్తూ ‘అమెరికా మోహరించిన యుద్ధ విమాన వాహక నౌక కంటే మేము సముద్ర గర్భంలోకి పంపే ఆయుధమే శక్తివంతమైనది’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అమెరికా సైన్యం శక్తివంత మైనదని ట్రంప్ చెబుతున్నారని, అయితే అలాంటి శక్తివంతమైన సైన్యానికి కొన్నిసార్లు కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతాయని చురకలు అంటించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల ఫలితాన్ని ట్రంప్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. అలా చేయడం తప్పని, మూర్ఖత్వమని ఖమేనీ విమర్శించారు.
అమెరికా-ఇరాన్ అణు చర్చలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



