నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలో కాల్పుల విరమణను పటిష్టం చేయడానికి ఉద్దేశించిన డిక్లరేషన్‌పై తనతో పాటు ప్రాంతీయ నాయకులు సోమవారం సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇది పశ్చిమాసియాకి ఒక అద్భుతమైన రోజని ప్రశంసించారు. ఇజ్రాయిల్ మరియు హమాస్ బందీలు మరియు ఖైదీల మార్పిడిని ప్రారంబించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ నుండి ఈ ప్రకటన వెలువడింది. ముందుగా ఇజ్రాయిల్ బందీలకు ఆయన స్వాగతం పలికారు. ఇది గొప్పరోజని, ఇది కొత్త ప్రారంభమని అన్నారు. రెండేళ్ల గాజా యుద్ధం ముగిసిందా అని మీడియా ప్రశ్నించగా.. అవును అని సమాధానమిచ్చారు.
గాజా శాంతి ఒప్పందంపై చర్చించడానికి ట్రంప్ షర్మ్ ఎల్-షేక్‌లోని ఒక రిసార్ట్‌లో పలువురు ప్రపంచ నేతలతో సోమవారం సమావేశమైన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం ట్రంప్, ఈజిప్ట్, ఖతార్ మరియు టర్కీ నేతలతో కలిసి గాజా ఒప్పందానికి హామీదారులుగా ప్రకటనపై సంతకం చేశారు. ఈ ప్రకటన నియమాలు, నిబంధనలను మరియు పలు అంశాలను వివరిస్తుందని సంతకం చేయడానికి ముందు ట్రంప్ అన్నారు.
గాజా శాంతి ప్రణాళికలో రెండవ దశ ప్రారంభమైందనది అన్నారు. దశలన్నీ ఒకదానితో ఒకటి కొద్దిగా మిశ్రమంగా ఉన్నాయని అన్నారు. హమాస్‌తో చర్చల్లో ఈజిప్ట్ అధ్యక్షుడు చాలా కీలక పాత్ర పోషించారని ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అయితే ఈ శిఖరాగ్ర సమావేశానికి ఇజ్రాయిల్, హమాస్ ప్రతినిధులు హాజరుకాలేదు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మూద్ అబ్బాసతో కూడా ట్రంప్ కొన్ని నిమిషాల పాటు సమావేశమయ్యారు.
మొదటి దశలో భాగంగా ఇజ్రాయిల్, హమాస్‌ల మధ్య ఖైదీల, బందీల మార్పిడి ప్రారంభమైంది. ఇజ్రాయిల్ విడుదల చేసిన ఖైదీల్లో సుమారు 250 మంది భద్రతా ఖైదీలు ఉన్నారు. ఇజ్రాయిలీలను హత్య చేశారన్న ఆరోపణలపై వారిని నిర్బంధించింది. యుద్ధ సమయంలోనూ గాజాలో సుమారు 1700 మందిని ఇజ్రాయిల్ సైన్యం అదుపులోకి తీసుకుంది.