చైనాకు చమురు ఎగుమతులు కుదించాలి
ట్రంప్-నెతన్యాహు నిర్ణయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహులు వైట్‌హౌస్‌లో జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌పై ‘గరిష్ట ఒత్తిడి’ (మ్యాగ్జిమమ్ ప్రెషర్) విధానాన్ని మరింత కఠినతరం చేయాలని ఇరువురు నేతలు అంగీకరించినట్టు నివేదికల సమాచారం. ముఖ్యంగా ఇరాన్ నుంచి చైనాకు జరిగే చమురు ఎగుమతులను తగ్గించే దిశగా అమెరికా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇరాన్ చమురు విక్రయాలపై, ముఖ్యంగా చైనాకు వెళ్లే సరఫరాలపై పూర్తి శక్తితో ఒత్తిడి తీసుకురావాలని ఇరువురు నేతలు అంగీకరించారని అమెరికా అధికారులు వివరించారు. ప్రస్తుతం ఇరాన్ నుంచి చమురు ఎగుమతుల్లో 80 శాతానికి పైగా చైనా వాటా ఉన్నది. ఈ వాణిజ్యం తగ్గితే.. ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయం గణనీయంగా పడిపోతుంది. దీంతో ఇరాన్‌పై పైచేయి సాధించే చర్యల్లో భాగంగానే అమెరికా- ఇజ్రాయిల్ అధినేతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.



