సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి పోరాడుతున్న ఆ దేశానికి సాయమందించండి
క్యూబా సంఘీభావ సదస్సులో వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”క్యూబాపై అమెరికా ఆంక్షలు గర్హనీయం. ట్రంప్ రెండోసారీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆ దేశం మరింత దూకుడుగా ఆంక్షలను అమలు చేస్తోంది. లాటిన్ అమెరికా తదితర దేశాలను నయానో బయానో బెదిరించి శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు నిత్యావసర వస్తువులను కూడా అందకుండా చేస్తోంది. ఫలితంగా క్యూబా నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సామ్రాజ్యవా దానికి ఎదురొడ్డి పోరాడుతున్న ఆ దేశానికి విరివిగా సాయం అందించాలి” అని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”కన్వెన్షన్ ఇన్ సాలిడారిటీ విత్ క్యూబా” అనే పేరుతో నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్న ఏకైక దేశం క్యూబానేనని గుర్తు చేశారు. క్యూబా విచ్ఛిన్నానికి అగ్రరాజ్య గూఢాచార సంస్థ సీఐఏ చేసిన ప్రయత్నాలనన్నింటినీ తట్టుకుని నిలిచిం దని కొనియాడారు. ప్రపంచ పోరాటాలకు మార్గదర్శకంగా నిలిచిన ఆ దేశానికి యావత్ తెలంగాణ సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
క్యూబాను ఆదుకోవాలి: అరుణ్‌కుమార్
నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా నాయకులు ఆర్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ 1959 విప్లవం తర్వాత దేశం సోషలిజం, ఆర్థిక సమానత్వం దిశగా ఫిడరల్ క్యాస్ట్రో నాయకత్వంలో ముందుకు సాగిందని గుర్తు చేశారు. అప్పటి వరకు క్యూబాలో ఉన్న అమెరికా కంపెనీలు ఆ దేశ రైతులు, ప్రజల రక్తాన్ని తాగుతున్న నేపథ్యంలో వాటిని జాతీయం చేశారని చెప్పారు. ఈ పరిణామాలను జీర్ణించు కోలేని అమెరికా ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించిందన్నారు. అరవై ఏండ్లుగా కొనసాగుతున్న ఆంక్షలు ట్రంప్ రెండో సారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వికృత రూపం దాల్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో విద్య, వైద్యం లాంటి కనీస వసతులను తరతమ భేదం లేకుండా అందరికీ ఉచితంగా అందిస్తున్న ఏకైక దేశం ఒక్క క్యూబా మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రపంచానికి అమెరికా ఆయుధాలను, సైనికులను సరఫరా చేస్తుంటే. క్యూబా మాత్రం వైద్యులను సరఫరా చేస్తూ మనుషుల ప్రాణా లను కాపాడుతోందని గుర్తు చేశారు. అలాంటి మానవీయ విలువలు కలిగిన క్యూబా అమెరికా అడ్డగోలు ఆంక్షల వల్ల విద్యుత్, ఆహారం, ఔషధ రంగాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు క్యూబాకు ఇతోధిక సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి సుధీర్‌బాబు మాట్లాడుతూ క్యూబా విప్లవాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచంలోని అనేక దేశాలు విముక్తి పొందాయని అన్నారు. ప్రధాని నెహ్రూ కాలం నుంచి క్యూబాతో భారత దేశానికి బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మెన్ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఇటీవల క్యూబా పర్యటించిన సందర్భంలో అక్కడి ప్రజల పోరాట స్పూర్తి ఎంతగానో ఆకర్శించిందని చెప్పారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వందేండ్లయినా పోరాటానికి తాము సిద్ధమని అక్కడి యువత మాటలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు డిజి.నర్సింహరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రచయిత యాకుబ్, సీనియర్ జర్నలిస్ట్ సలీమా వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
క్యూబాపై అమెరికా ఆంక్షలు గర్హనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES