యూఎస్‌లో 550బిలియన్ డాలర్ల టోక్యో పెట్టుబడులు
ప్రతిగా సుంకాలను తగ్గించిన ట్రంప్
వాషింగ్టన్ : జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. జపాన్ ఆర్థిక సాయంతో అమెరికాలో చేపట్టే మూడు ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. వీటి విలువ 36 బిలియన్ డాలర్లు. జపాన్ సాయంతో టెక్సాస్‌లో చమురు ఎగుమతి కేంద్రం, జార్జియాలో కీలక ఖనిజాల ప్లాంట్, ఒహియోలో సహజ వాయువు విద్యుత్ ప్లాంటు ఏర్పడతాయి. ఒప్పందంలో భాగంగా అమెరికాలో జపాన్ 550 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. తొలి విడతగా ఈ మూడు ప్రాజెక్టులు చేపడతారు. జపాన్ పెట్టుబడులకు ప్రతిగా ఆ దేశంపై విధించిన సుంకాలను పదిహేను శాతానికి తగ్గిస్తామని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో తెలియజేశారు.
‘అమెరికాలో 550 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధపడింది. వీటిలో తొలి విడతగా అధికారికంగా 36 బిలియన్ డాలర్ల పెట్టుబడితో మూడు ప్రాజెక్టులు చేపట్టబోతోంది’ అని ట్రంప్ తెలిపారు. అమెరికా పారిశ్రామిక రంగానికి జవసత్వాలు కల్పించేందుకు ఈ చారిత్రక ఒప్పందం దోహదపడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల పరిధి చాలా పెద్దదని, సుంకాలు అనే ప్రత్యేక మాట లేకుండా అవి సాధ్యపడవని వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదరడానికి తన వాణిజ్య విధానాలే కారణమని చెప్పుకున్నారు. జపాన్ ప్రధాని సనే తకైచీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రకటన వెలువడింది.
జపాన్‌తో కుదిరిన ఒప్పందంతో వేలాది మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ‘అమెరికా మళ్లీ నిర్మాణం అవుతోంది. మళ్లీ ఉత్పత్తి చేస్తోంది. మళ్లీ విజయం సాధిస్తోంది’ అని అన్నారు. ఇది రెండు దేశాలకూ ఉత్తేజకరమైన, చారిత్రకమైన సమయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. సహజ వాయువుతో విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు జపాన్ 33 బిలియన్ డాలర్లు వెచ్చిస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ చెప్పారు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ప్లాంటు అని తెలిపారు. ఇది ఏటా 9.2 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని, ఒహియోలోని నివాస గృహాలకు విద్యుచ్ఛక్తిని అందించేందుకు అది సరిపోతుందని అన్నారు. కాగా ఈ ఒప్పందం దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యమని శ్వేతసౌధం అభివర్ణించింది.
జపాన్‌తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



