Thursday, November 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా సుంకాలు- భారత్‌పై తీవ్ర ప్రభావం!

అమెరికా సుంకాలు- భారత్‌పై తీవ్ర ప్రభావం!

- Advertisement -

భారత ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. దేశ జీడీపీ మీద, ఉత్పత్తి, ఉపాధి అవకాశాల ప్రభావం దేశంలోని కొన్ని కేంద్రాల్లో తీవ్రంగా ఉంది. అమెరికా సుంకాలు పది శాతంతో ప్రారంభమై ఆగస్టు 7 నాటికి 25 శాతం, ఆగస్టు 25 నాటికి 50శాతానికి చేరుకున్నాయి. వీటివల్ల గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిపోర్ట్‌ ప్రకారం 2025 మే నుండి సెప్టెంబర్‌ నాటికి అమెరికాకు మన దేశం చేసే ఎగుమతులు 37.5శాతానికి పడిపోయాయి. అమెరికాకు భారతదేశం ప్రతి సంవత్సరం సగటున 86.51 బిలియన్‌ డాలర్లు విలువ గల సరుకులను ఎగుమతులు చేస్తున్నది. ఇందులో 43శాతం అంటే 49.6 బిలియన్‌ డాలర్ల విలువ గల సరుకుల ఎగుమతులు పడిపోయాయి. వీటివల్ల అనేక రకాలుగా నష్టం జరిగింది. 2025 మేలో 8.8 బిలియన్‌ డాలర్ల విలువ గల సరుకులు ఎగుమతి చేస్తే, సెప్టెంబర్‌లో 5.5 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దేశ జీడీపీలో 0.9శాతం తగ్గుదలకు అవకాశం ఏర్పడింది. జీడీపీ 6.5శాతం నుండి 5.6శాతానికి తగ్గే పరిస్థితి ఏర్పడింది.

అమెరికాకు ఎగుమతులు తగ్గడంతో ఉత్పత్తి చేసే కంపెనీలలో సరుకులు గోడౌన్‌లలో మూలుగుతున్నాయి. సరుకు ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. ఫలితంగా కార్మికులకు ఉపాధి తగ్గి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అంతిమంగా దేశంలో నిరుద్యోగం పెరగడానికి ఆర్థిక మందగమనం పెరగడానికి సంక్షోభానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి నివారణకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికాను ఎదిరించే దమ్ము లేక దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నది. అమెరికా సుంకాల వల్ల కీలక రంగాలు తీవ్ర నష్టాలకు గురవుతున్నాయి. మే నుండి సెప్టెంబర్‌ వరకు ఫార్మాస్యుటికల్‌ ఎగుమతులు 15.7శాతం పడిపోయాయి. వాటి విలువ సుమారు 745.6 మిలియన్‌ డాలర్ల నుండి 628.3 మిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఇండిస్టియల్‌ మెటల్స్‌ ఆటో పార్ట్స్‌ ఇతరాలు ప్రపంచవ్యాప్తంగానే 16.7శాతం ఎక్స్‌పోర్ట్‌ తగ్గాయి.

మన దేశం నుండి ఎగుమతయ్యే అల్యూమినియం ఎక్స్‌పోర్ట్‌ 37శాతం, కాపర్‌ 25శాతం, ఆటో పార్ట్స్‌ 12శాతం, ఐరన్‌ మరియు స్టీల్‌ 8శాతం ఎగుమతులు తగ్గాయి. ఉత్పత్తి రంగంలోని కార్మికులు ఉపాధి పొందుతున్న రంగాలలో వస్త్రాలు, రసాయనాలు, వ్యవ సాయ, ఆహార పరిశ్రమలు, యంత్రాలు, రత్నాలు, ఆభరణాలు రంగాల యొక్క ఎగుమతులు 33శాతం పడిపోయాయి. ఇందులో మే నెలలో 4.8 బిలియన్‌ డాలర్ల నుండి సెప్టెంబర్‌ నాటికి 3.2 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. రత్నాల ఆభరణాల ఎగుమతులు 59.2 శాతం తగ్గి సుమారు 500.2 మిలియన్‌ డాలర్ల నుండి 202.8 మిలియన్‌ డాలర్ల విలువ గల సరుకులు తగ్గి పోయాయి.

ఆ మేరకు వియత్నాం, థారులాండ్‌లు అమెరికా ఆర్డర్స్‌ పొంది లాభపడ్డాయి. సోలార్‌ ప్యానల్స్‌ ఎగుమతులు కూడా 60.8శాతం పడిపోయాయి. అంటే సుమారు 202.6 మిలియన్‌ డాలర్ల నుండి 79.4 మిలియన్‌ డాలర్ల విలువ నష్టపోవడం జరిగింది. ప్రధానంగా స్మార్ట్‌ ఫోన్‌ ఎగుమతులు కూడా భారీగా తగ్గాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 197శాతం ఎగుమతులు పెరిగితే, ఈ మే నుండి 58 శాతం పడిపోయాయి. 2.2 బిలియన్‌ డాలర్ల నుండి 884.6 మిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. వీటన్నింటిని బట్టి మనకు అర్థమయ్యేదేమంటే అమెరికా ట్రంప్‌ సుంకాల వల్ల మన దేశం ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్థికంగా నష్టం జరిగింది.


ఉపాధి ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం!
మన దేశం అమెరికాకు సుమారు 86 బిలియన్‌ డాలర్ల విలువగల సరుకులు ఎగుమతి చేస్తున్నది. ఈ సంవత్సరం 50 బిలియన్‌ డాలర్లకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేయబడింది. ఈ ఐదునెలల్లో 4.36 లక్షల కోట్ల విలువ గల సరుకులు ఎగుమతి ఆగిపోయి దేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశంలో తయారీ, సేవల రంగాలు వాటి కార్యకలాపాలు తీవ్రంగా మందగిస్తున్నాయి. దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఇదేవిధంగా సుంకాలు కొనసాగితే టెక్స్‌టైల్‌, గార్మెంట్స్‌ రంగాలలో దాదాపు లక్ష ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. రత్నాలు ఆభరణాలు, సుమారు 80 నుంచి 90 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సూరత్‌ ముంబై వాణిజ్య కేంద్రాలలో డిమాండ్‌, ప్రొడక్షన్స్‌ తగ్గాయి. తోలు పరిశ్రమలో 20 నుండి 30 వేల ఉద్యోగాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం, రొయ్యలు వంటి రంగాల్లో 20 వేలు, రసాయనాలు, ఔషధాలు, ఆటో విడిభాగాల వంటి వాటిలో 40 నుంచి 50 వేల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో పదివేల ఉద్యోగాలు పోతాయి. ఈ సుంకాల ప్రభావం వల్ల గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లోని ప్రధానమైన నగరాలలో వీటి ప్రభావం ఉంటుంది.

ఇంత నష్టం జరుగుతున్నా మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది. సుంకాల విధింపులకు కొద్ది నెలల ముందు ఫిబ్రవరిలో మోడీ అమెరికా పర్యటనలో ‘మిషన్‌ 500’ అని ఒప్పందం చేసుకొని 2030 నాటికీ 500 బిలియన్‌ డాలర్లు ఎగుమతి లక్ష్యంగా ప్రకటించింది. ఇదంతా జరగాలంటే రష్యాతో ఆయిల్‌ కొనరాదని, చైనాతో వ్యాపార సంబంధాలు ఉండరాదని, ముఖ్యంగా బ్రిక్స్‌ దేశాలలో సఖ్యత వాణిజ్యం తగ్గించుకోవాలని, డాలర్‌కు పోటీగా స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేయరాదని అమెరికా కోరుకుంటున్నది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత్‌ పరోక్షంగా పాల్గొంటుందని, రష్యాతో ఆయిల్‌ కొనడం వల్లే రష్యా యుద్ధం చేస్తున్నదని ఆరోపించింది. మన దేశం వీటిని ఖండించినా ప్రతిఘటించడం లేదు.

చైనాపై వేసిన సుంకాలకు అమెరికాకు ధీటుగా జవాబు చెప్పి ప్రత్యామ్నాయంగా వేరే దేశాల్లో తన సరుకులు ఎగుమతి చేసుకొని లాభపడుతున్నది. చివరికి వియత్నాం, థారులాండ్‌ లాంటివి కూడా లాభపడ్డాయి. భారత్‌ తీవ్రంగా నష్టపోయింది. మన వాణిజ్య సంబంధాలు అమెరికా కన్నా రష్యాతో ఉండడం వల్ల మనకు లాభం కలిగింది. ఈ కాలంలో రష్యాలో ఆయిల్‌ కొనడం వల్ల మన దేశం చాలా లాభపడింది. 2025 సంవత్సరంలో రోజుకు రెండు మిలియన్‌ బ్యారెల్స్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకున్నాము. మొత్తం చమురులో 40 శాతం ఇది. ఒక బ్యారెల్‌ మీద 15 నుండి 20 డాలర్లు డిస్కౌంట్‌ లభిస్తున్నది. ఈ సంవత్సరం 3.8 బిలియన్‌ డాలర్లు అదా చేసుకున్నాం. మొత్తంగా 2022 నుండి ఇప్పటివరకు 10 బిలియన్‌ డాలర్లు ఆదా అయింది. అంటే మన రూపాయలలో రూ.88,732 కోట్లు. ఇది భారతదేశ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బడ్జెట్‌ కన్నా రూ.10 వేల కోట్లు ఎక్కువే. తెలంగాణ బడ్జెట్‌లో 40శాతం అని చెప్పవచ్చు.

రష్యాలో చమురు కొనడం వల్ల మనకు కలిగిన లాభం ఇది. ఈ సొమ్ము కూడా దేశ ప్రజలకు ఉపయోగపడడం కన్నా దేశంలోని అంబానీ లాంటి బడా పెట్టుబడుదారులకు లాభం కలిగింది. రష్యాతో వ్యాపారం వల్ల మిగిలిన సొమ్ములో ఒక రిలయన్స్‌కే 40శాతం వెళ్లింది. అంటే సుమారు 30 వేల కోట్లు లాభపడ్డారు. కానీ ఆయిల్‌, పెట్రోల్‌, డీజిల్‌ రేటు తగ్గించలేదు. ఇప్పటికే రష్యాతో చమురు దిగుమతులు తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంబానీ కంపెనీలు చమురు దిగుమతులు తగ్గించుకోవడం లేదు. కానీ ప్రభుత్వరంగ సంస్థలు రష్యా నుండి చమురు దిగుమతి తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది. ఐఓసీఎల్‌, హెచ్‌పిసిఎల్‌ అలాంటి ప్రయత్నాలలో ఉన్నాయి. రాబోయే కాలంలో ప్రభుత్వరంగ సంస్థలు నష్టాలకు గురై దివాలా తీసే పరిస్థితి ఏర్పడితే వాటిని బడా పెట్టుబడిదారులైన అంబానీకి, ఆదానీకి కట్టబెట్టే కుట్రలో ఇది భాగం.

మరో పక్క చైనాతో వాణిజ్య సంబంధాలు ఈ కాలంలో మెరుగుపడ్డాయి. మన దేశానికి చైనా నుండి దిగుమతులు క్రమంగా పెరిగాయి. 2024- 25 సంవత్సరంలో 113.45 బిలియన్‌ డాలర్లు విలువ గల సరుకులు దిగుమతి చేసుకున్నాము. మన దేశం నుండి చైనాకు ఎగుమతులు మాత్రం 14.25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నాయి. రెండు దేశాల మధ్యన వాణిజ్య వ్యత్యాసం 100 బిలియన్‌ డాలర్ల ఉంది. మన ఎగుమతులు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థకు లాభం కలుగుతుంది. చైనా మన ఎగుమతులను కూడా ఆహ్వానిస్తున్నది. చైనా మన దేశం సరుకులపై విధించే టారిఫ్‌లు 22శాతం ఉంది. కాబట్టి మనం చైనాకు ఎగుమతుల వల్ల ప్రయోజనం ఉంటుంది. చైనా, రష్యా తదితర బ్రిక్స్‌ దేశాలతో మనం కలిసి ఉండీ వ్యాపారం చేసుకుంటే మన దేశానికి ప్రయోజనం ఉంటుంది. మన ఉత్పత్తి రంగం దెబ్బ తినదు. ఉద్యోగాలు కోల్పోము. విదేశీ మారక ద్రవ్యం రూపంలో కూడా మిగులు ఉంటుంది. మన రూపాయి బలపడుతుంది. సరుకుల ధరలు తగ్గి ప్రజలకు లాభం కలుగుతుంది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశం ముఖ్యమా? అమెరికా ప్రయోజనాలు ముఖ్యమా? అనేది తేల్చుకోవాలి. కానీ ఆచరణలో అమెరికాతో అంటకాగడానికే మొగ్గు చూపుతున్నది. అమెరికా సుంకాల మీద దేశ ప్రజలే పోరాడాలి.

భూపాల్‌
9490098034

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -