Friday, January 9, 2026
E-PAPER
Homeబీజినెస్దలాల్‌ స్ట్రీట్‌కు యూఎస్‌ టారిఫ్‌ల దడ

దలాల్‌ స్ట్రీట్‌కు యూఎస్‌ టారిఫ్‌ల దడ

- Advertisement -

రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్‌ 780 పాయింట్ల పతనం
కొనసాగుతోన్న భౌగోళిక భయాలు
రోజంతా అమ్మకాలే…


ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు వరుసగా నాలుగో రోజూ భారీ నష్టాలను చవి చూశాయి. భారత్‌, చైనా వంటి దేశాలపై 500 శాతం సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలిపారనే రిపోర్టులు దలాల్‌ స్ట్రీట్‌ను దారుణంగా పడిపోయేలా చేశాయి. మరోవైపు వెనిజులాపై యూఎస్‌ ఉగ్రదాడి మరిన్ని భౌగోళిక ఆందోళనలకు దారి తీయొచ్చనే మదుపర్ల అంచనాలు ముంచాయి. దీనికితోడు విదేశీ మదుపర్ల అమ్మకాలు మరింత ఒత్తిడిని పెంచాయి. ఈ పరిణామాల మధ్య ఇటీవల ఎప్పుడూ లేని విధంగా గురువారం భారత మార్కెట్లు కుప్పకూలాయి. ఒక్క పూటలో మదుపర్ల సంపద రూ.8 లక్షల కోట్లు పైగా హరించుకుపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఉదయం 84,778 నష్టాల్లో ప్రారంభం కాగా.. ఏ దశలోనూ కోలుకోకపోగా రోజంతా అమ్మకాల ఒత్తిడిని చవి చూసింది. ఇంట్రాడేలో 84,110 కనిష్టానికి పడిపోయింది. తుదకు 780.18 పాయింట్లు లేదా 0.92 శాతం పతనమై 84,180.96కు దిగజారింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 263.9 పాయింట్లు లేదా 1.01 శాతం నష్టంతో 25,876.85కు పరిమితమయ్యింది.

2025 డిసెంబర్‌ 8 తర్వాత మార్కెట్లు అత్యధికంగా పడిపోవడం ఇదే తొలిసారి. గడిచిన నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తంగా 1600 పాయింట్లు, నిఫ్టీ 470 పాయింట్ల చొప్పున క్షీణించాయి. నిఫ్టీలో మిడ్‌ క్యాప్‌ 1.96 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.99 శాతం చొప్పున పతనమయ్యాయి. అన్ని రంగాల సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. లోహ సూచీ అత్యధికంగా 3 శాతం కోల్పోగా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 2.8 శాతం, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ 2 శాతం, ఐటీ 1.9 శాతం చొప్పున కుదేలాయ్యాయి. ఒక్క సెషన్‌లోనే మదుపర్ల సంపద రూ.8.1 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోవడంతో. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.480 లక్షల కోట్ల నుంచి రూ.472 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎటెర్నల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీఈఎల్‌ మినహా మిగిలిన అన్ని స్టాక్స్‌ నేల చూపులు చూశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్ 3.78 శాతం, జియో ఫైనాన్సీయల్‌ 3.57 శాతం, ఓఎన్‌జీసీ 3.29 శాతం చొప్పున అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. బీఎస్‌ఈలో 4,367 స్టాక్స్‌ ట్రేడింగ్‌ కాగా.. 1,039 సూచీలు రాణించగా.. 3,158 స్టాక్స్‌ పతనమయ్యాయి. మరో 170 స్టాక్స్‌ యథాతథంగా నమోదయ్యాయి.

ప్రతికూలాంశాలు..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలపై 500 శాతం వరకు అదనపు సుంకాలు విధించడానికి వీలుగా అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌ ‘శాంక్షనింగ్‌ ఆఫ్‌ రష్యా యాక్ట్‌ 2025’ అనే బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది భారత ఎగుమతిదారులు, ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన కలిగించింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా దుర్మార్గంగా అరెస్ట్‌ చేయడం అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచింది. ఈ వ్యవహారంపై వెనిజులాకు రష్యా, చైనా సహా పలు లాటిన్‌ అమెరికా దేశాలు మద్దతును ఇవ్వడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం కావొచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో పెరిగాయి.

దేశీయంగా దిగ్గజ సూచీలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ షేర్లు ఈ వారంలో 4 శాతం వరకు నష్టపోయాయి. ఇండెక్స్‌లో వీటి వాటా ఎక్కువ కావడంతో, ఈ షేర్ల పతనం మొత్తం మార్కెట్‌లను ఒత్తిడికి గురి చేశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత స్టాక్‌ మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరి నెలలో ఇప్పటివరకు సుమారు 694 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. భారత జిడిపి 2025-26లో 7.4 శాతం పెరగొచ్చనే అంచనాలు వేసినప్పటికీ.. ద్వితీయార్థంలో ఇది 6.9 శాతానికి పడిపోవచ్చనే రేటింగ్‌ ఎజెన్సీ అంచనాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. అంతర్జాతీయంగా జపాన్‌, చైనా, అమెరికా మార్కెట్లు బలహీనంగా ట్రేడింగ్‌ కావడం భారత మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -