నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో భారతీయుల కట్టడే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఏడాది హెచ్-1బీ వీసాల ఫీజును లక్షడాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఇమ్మిగ్రేషన్ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది. హెచ్-1బీ, ఎల్-1, ఓపీటీ వీసాలపై వీటి ప్రభావం నేరుగా ఉంటుందని స్పష్టం చేసింది. పెంచిన ఫీజులు ఈ ఏడాది మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో నమోదైన ద్రవ్యోల్బణం దృష్ట్యా ఇమ్మిగ్రేషన్ ప్రీమియం ఫీజుల్ని సవరించినట్లు వెల్లడించింది.
పెంచిన ఫీజుల ప్రకారం.. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వంటి వర్క్ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్లు (రూ.2.53 లక్షలు) నుంచి రూ.2,965 డాలర్లు (రూ.2.67 డాలర్లు)కు పెరగనుంది. ఎంప్లాయ్ మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్ పిటిషన్లకు కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. విద్యార్థులకు.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT), స్టెమ్-OPT దరఖాస్తుల ఫీజు 1,685 డాలర్లు (రూ.1.52 లక్షలు) నుంచి 1780 డాలర్లు (రూ.1.60 లక్షలు)కి పెంచింది. F-1, J-1 విద్యార్థుల స్టేటస్ మార్పు దరఖాస్తుల ఫీజును 1965 డాలర్లు (రూ.1.77 లక్షలు) నుంచి 2,075 డాలర్లు (రూ.1.87 లక్షలు)కు పెరిగింది.



