ఒకప్పుడు దేశ తయారీ, నాణ్యత ఉన్నతమైనవి
ఆ వైభవాన్ని తిరిగి పొందాలి
జీఎస్టీ సంస్కరణలు దేశ వృద్ధికి కొత్త దిశ
స్వావలంబన మంత్రంతో ముందుకు సాగాలి : ప్రధాని మోడీ
నేటి నుంచి జీఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారంభం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
జీఎస్టీ సంస్కరణలు దేశ వృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గతంలో దేశ తయారీ, నాణ్యత ఉన్నతంగా ఉండేవని, ఆ వైభవాన్ని తిరిగి పొందాలని ఆయన చెప్పారు. ఆదివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. నేటి నుంచి ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ ప్రారంభమవుతుండడంతో ప్రధాని మోడీ స్వదేశీని స్వీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. స్వావలంభన మంత్రంతో ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. దేశ ప్రజలకు ఏది అవసరమో.. దేశీయంగా ఏం తయారు చేయగలమో దాన్ని దేశీయంగానే తయారు చేయాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు, నియమాలు, నిబంధనలు, విధానాల సరళీకరణతో ఎంఎస్‌ఎంఈలు, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు ఎంతో ప్రయోజనం పొందుతాయన్నారు. అమ్మకాలు సైతం పెరుగుతాయన్నారు. వాటి పై తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుం దన్నారు. దేశ శ్రేయస్సు శిఖరాగ్రంలో ఉన్నప్పుడు చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనవన్నారు. మన పరిశ్రమలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలని, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచంలోని అత్యుత్తమ ప్రమాణాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. గత 11 ఏండ్లలో 250 మిలియన్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని తెలిపారు. 1.2 మిలియన్ల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపులు మధ్య తరగతికి గణనీయమైన ఉపశమనాన్ని అందించాయన్నారు.
జీఎస్టీ సంస్కరణలు గృహ నిర్మాణం, స్కూటర్లు, కార్లు, హోటల్స్ వంటి ఖర్చులను తగ్గిస్తాయన్నారు. పేదలు, నవ మధ్యతరగతి రెండింతలు ప్రయోజనం పొందుతారని ఆయన వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో పన్నులు, టోల్‌ల సంక్లిష్టతల నుంచి విముక్తి కంపెనీలకు ఒక సవాలుగా ఉందన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తువులను రవాణా చేయడం చాలా కష్టంగా ఉందని, కంపెనీలు యూరప్‌కు రవాణా చేయడానికి ఇష్టపడతాయన్నారు. కొత్త సంస్క రణలు వ్యాపారాన్ని సులభతరం చేస్తాయని, వినియోగదారులపై భారాన్ని తగ్గిస్తా యని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అభివృద్ధి పథంలో ప్రతీ రాష్ట్రాన్ని సమానంగా కలుపుతాయని వెల్లడించారు. 2017లో జీఎస్టీ అమలు ఒక చారిత్రాత్మక అడుగు అని, ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని తెలిపారు. పేదలు, మధ్యతరగతి, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యవస్థాపకులు అందరూ ఈ సంస్కరణ లతో ప్రయోజనం పొందుతారన్నారు. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు ‘నాగరిక దేవో భవ’ను ప్రతిబింబిస్తాయన్నారు.
నవరాత్రి మొదటి రోజు నుంచి ఆత్మనిర్భర్ భారత్ వైపు దేశం అడుగులు వేస్తుందన్నారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైందని అన్నారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపు, జీఎస్టీ సంస్కర ణలు ప్రజలకు రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేస్తాయన్నారు. 2017లో జీఎస్టీ సంస్కరణ ప్రారంభించినప్పుడు పాత చరిత్రను అది మార్చిందని, ప్రస్తుత జీఎస్టీ సంస్కరణలు కొత్త చరిత్ర సృష్టించడానికి నాంది పలికిందని అన్నారు. ప్రతిరోజూ అవసరమైన వస్తువులు పన్ను రహితంగా లేదా 5శాతం లేదా 18శాతం జీఎస్టీ కింద ఉంటాయని చెప్పారు. 12శాతం పన్ను ఉన్న 99శాతం వస్తువులు 5శాతం పన్నులోకి వచ్చా యని, పేదలు వాడే అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు. ఆహార పదార్ధాలు, ఔషధాలు, సబ్బులు, బ్రష్, పేస్ట్, హెల్త్ అండ్ ఇన్సూరెన్స్, ఇంకా పలు వస్తువులు, సేవలు జీరో టాక్స్ లేదా 5 శాతం పన్నుకే పరిమితమవుతాయని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాంజాగా అభివర్ణించారు.