ఏ రంగంలో ఖర్చు చేయాలో మీరే నిర్ణయించుకోండి
సమన్వయం కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియామకం
కంపెనీల ప్రతినిధులతో సీఎం సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల వినియోగంపై ఇప్పటి వరకు రాష్ట్రంలో సంపూర్ణ విధానమే లేదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. అందువల్లే కంపెనీలను సమన్వయం చేసుకొనేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామన్నారు. ఎక్కడి సంస్థలు ఆ ప్రాంతాల్లోనే సీఎస్‌ఆర్ నిధుల్ని ఖర్చు చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాధాన్య రంగాలను వారే ఎంచుకోవాలని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సీఎస్‌ఆర్ నిధులను ఖర్చుగా కాకుండా, అభివృద్ధిలో భాగస్వామ్యంగా చూడాలని కోరారు. సీఎస్‌ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.
సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ప్రభుత్వ శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్ని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య రంగాలను కంపెనీల ప్రతినిధులకు వివరించారు. విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణ, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వీటితో పాటు కంపెనీలు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్‌ఆర్ నిధులు వినియోగించాలని కోరారు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు సీఎస్‌ఆర్ నిధుల ద్వారా చేసే ఖర్చుల వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచ స్థాయి నైపుణ్యంగలవారిగా తీర్చిదిద్దబడతారని తెలిపారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్ నగరంలోనే 44 శాతం ఉన్నారనీ, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్‌ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు. ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయంటూ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సీఎస్‌ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
పాఠశాల విద్యా, ఆస్పత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు వారు ఆసక్తి చూపారు. సమావేశంలో శ్రావణ్‌కుమార్ (రహేజా ఫౌండేషన్), దాక్షయణి ఆళ్ల (రాంకీ ఫౌండేషన్), డాక్టర్ గోరుకంటి సురేందర్‌రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు (యశోద ఆస్పత్రి), సుధారెడ్డి (మేఘా), అపర్ణారెడి (అపోలో ఆస్పత్రి), కామినేని భాస్కర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్), పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి (నాదం ఫౌండేషన్), ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేశ్ ధోత్రే, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.



