ఉత్తరకాశీ, న్యూఢిల్లీ : బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో పాత్రికేయులకు సైతం రక్షణ లేకుండా పోతోంది. నిజాలను నిర్బయంగా వెల్లడించే ప్రత్యామ్నాయ మీడియాపై విస్మయకర రీతిలో దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో ప్రముఖ జర్నలిస్టు రాజీవ్ ప్రతాప్ సింగ్ అనుమానాస్పదరీతిలో చనిపోయారు. గత సెప్టెంబరు 18న ఆయన అదృశ్యమవగా ఆ మరుసటి రోజు ఆయన కారును భాగీరథి నదికి సమీపంలో కనుగొన్నారు. ఆ తర్వాత పది రోజులకు అంటే సెప్టెంబరు 28న ఆయన మృతదేహాన్ని ఉత్తరకాశీలోని ఒక చెరువు నుండి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని దయనీయ పరిస్థితులను తన కథనాల ద్వారా వెల్లడించిన నేపథ్యంలో రాజీవ్ ఇలా అనుమానాస్పద రీతిలో మరణించడం పట్ల పాతిక్రేయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను కచ్చితంగా హత్య చేసి..ఇలా పడేసివుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తునకు రాహుల్ డిమాండ్
జర్నలిస్టు రాజీవ్ ప్రతాప్ సింగ్ మృతిపై తక్షణమే నిష్పాక్షికంగా, పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదృశ్యమవడం, ఆ తర్వాత పది రోజులకు ఆయన చనిపోయి కనిపించడం వెనుక అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఇదంతా చూస్తుంటే భయానకంగా అనిపిస్తోందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు. బిజెపి పాలనలో నిజాయితీ గల జర్నలిజం నేడు భయం, అభద్రతా నీడలో జీవిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.
అనుమానాస్పద రీతిలో ఉత్తరాఖండ్ జర్నలిస్టు మృతి
- Advertisement -
- Advertisement -