Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్నకిలీ పత్రాలతో ఖాళీ స్థలాలు స్వాహా

నకిలీ పత్రాలతో ఖాళీ స్థలాలు స్వాహా

- Advertisement -

– బతికున్న దంపతులకు డెత్‌ సర్టిఫికెట్‌
– వారసులుగా రంగంలోకి ఇతరులు
– 8 మందిని అరెస్టు చేసిన రాచకొండ ఎస్‌వోటీ, కీసర పోలీసులు
– 5 కోట్లు విలువ చేసే ప్లాట్లు గుర్తింపు
– కోట్లు సంపాదించిన బైక్‌ మెకానిక్‌
– పరారీలో మరో 10 మంది
నవతెలంగాణ- సిటీబ్యూరో

ఖాళీ స్థలాలు, ఓపెన్‌ ప్లాట్స్‌, భూములకు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని కాజేసి.. ఆ స్థలాలు తమవేనంటూ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కీసరలో కోట్లు విలువచేసే భూములను గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు. ఇందుకు సంబంధించి గురువారం డీసీపీ పద్మాజారెడ్డి, ఏ.రమణారెడ్డి, అడిషనల్‌ డీసీపీ ఎన్‌.నర్సింహా రెడ్డితో కలిసి రాచకొండ సీపీ సుధీర్‌బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కైన ఓ బైక్‌ మెకానిక్‌ రూ.5 కోట్లు విలువ చేసే ఐదు ప్లాట్లకు నకిలీ పత్రాలను సృష్టించాడు. అందులో మూడు ప్లాట్లను ఇతరులకు విక్రయించాడు. అసలు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన రాచకొండ ఎస్‌ఓటీ, కీసర పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. మరో 10 మంది పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుంచి నకిలీ పత్రాలతోపాటు, వాటిని తయారు చేసేందుకు ఉపయోగించిన 20 రకాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాంపల్లిలో నివాసం ఉంటున్న బీగుగూడెం అరవింద్‌ బైక్‌ మెకానిక్‌. స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న సంపంగి సురేశ్‌, ఈగ హరిప్రసాద్‌తో కలిసి ఖాళీ స్థలాలకు నకిలీ పత్రాలు తయారు చేసి వాటిని విక్రయించి కోట్లాది రూపాయాలను సంపాదించేందుకు పథకం వేశారు. ముందుగా రాంపల్లి ప్రాంతంలోని ఖాళీ ప్లాట్లను గుర్తించారు. అందులో మొదటి సేల్‌ డీడ్‌ మాత్రమే ఉన్న ప్లాట్‌ను ఎంపిక చేస్తారు. ఖాళీగా.. ఎలాంటి ఫెన్సింగ్‌ లేకుండా ఉన్న వాటిని ఎంచుకుంటారు. సేల్‌ డీడ్‌లో ఉన్న పేరు, చిరునామా, వయస్సును పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆ చిరునామాపై ఆరా తీసి యజమానులు ఉన్నారా, లేదా ఎక్కడికైనా వెళ్లిపోయారా, బతికే ఉన్నారా, చనిపోయారా వంటి వివరాలను సేకరిస్తారు. ఈసీ, సర్టిఫైడ్‌ సేల్‌డీడ్‌ కాపీలను తీసి వాటి ద్వారా నకిలీ పత్రాలు సృష్టిస్తారు. ఆ తర్వాత మార్కెట్‌లో పెట్టి విక్రయిస్తారు. ఇలా ఈ గ్యాంగ్‌ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో ప్లాట్‌ యజమాని బతికి ఉండగానే అతను, అతని భార్య సైతం మృతిచెందినట్టు ఇద్దరి పేర్లతో నకిలీ డెత్‌ సర్టిఫికెట్లు తయారు చేసి వారి వారసులుగా వేరేవారిని తెరపైకి తీసుకొస్తారు. ఇదే తరహాలో ఓ యువతికి డబ్బు ఆశ చూపించి ఆమెతో దాదాపు రూ. 75 లక్షల విలువ చేసే ప్లాట్‌ను ఇతరులకు విక్రయించారు. అయితే విషయం తెలుసుకున్న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఈ ముఠా నకిలీ పత్రాలు తయారు చేసి ఏకంగా కోర్టులో కేసు వేసి అసలు యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లేదా సెటిల్‌మెంట్‌ పేరుతో కొంత ముట్టజెప్పి ప్లాట్స్‌ను ఆక్రమిస్తున్నారు. ఇదే తరహాలో ఈ ముఠా మొత్తం ఐదు ప్లాట్‌లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించారు. ఈ ముఠాలోని కొంత మందిపై భూ ఆక్రమణకు సంబంధించిన 11 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీగూడెం అరవింద్‌, సంపంగి సురేశ్‌, ఈగ హరిప్రసాద్‌, చెక్కల సోమనాథ్‌, కోట్ల నాగేంద్ర ప్రసాద్‌, మహ్మద్‌ హూస్సేన్‌, యంజాల శేఖర్‌, వీరమచినేని వనజ ఉన్నారు. ఇక అమరేంద్ర, మాణిక్‌, అహ్మాద్‌, ముసుకు సునిల్‌ కుమార్‌తోపాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నారు.
సర్టిఫైడ్‌ కాపీలతో రిజిస్ట్రేషన్‌లు ఎలా జరిగాయి, సర్టిఫైడ్‌ కాపీల మీద రిజిస్ట్రేషన్‌లు చేయడానికి నిబంధనలను రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అధికారులు పాటించారా లేదా.. అనే తదితర కోణాల్లో విచారిస్తున్నామని సీపీ తెలిపారు. ఎవరైనా ప్లాట్స్‌, ఫ్లాట్స్‌, భూములు కొనుగోలు చేయాలంటే అన్ని పత్రాలనూ చూసుకోవాలని, అనుమానం వస్తే సంబంధింత ప్రభుత్వ కార్యాలయాల్లో తీసుకోవాలని రాచకొండ సీపీ తెలిపారు. దళారులను నమ్మిమోసపోవద్దని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad