– నవతెలంగాణ కథనానికి స్పందన
– ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు.. బస్తాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘వడ్ల రైతు వర్రీ’ శీర్షికన ‘నవతెలంగాణ’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. కొనుగోళ్లు మందకొడిగా సాగే కేంద్రాలకు లారీలు, గన్నీ బ్యాగ్‌లను పంపించింది. ఆయా కేంద్రాల్లో వేలకు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. కనీసం 20 రోజుల పాటు నిత్యం మిల్లులకు వడ్లు రవాణా చేస్తేనే కేంద్రాలు చాలా వరకూ ఖాళీ అవుతాయి. అలా కాకుండా అరకొరగా లారీలు, బస్తాలు పంపితే మాత్రం అకాల వర్షాలు వెంటాడుతున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
బీరోలు ఐకేపీ సెంటర్‌కు లారీ, బస్తాలు
తిరుమలాయపాలెం మండలం బీరోలు ఐకేపీ కేంద్రానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకొని మంగళవారం ఓ లారీతో పాటు 4వేల గన్నీ బ్యాగ్‌లను పంపించారు. ఏప్రిల్ 11వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఒక్క లారీ లోడ్ 700 బ్యాగ్‌ల ధాన్యాన్ని మాత్రమే ముదిగొండ మిల్లుకు తరలించారు. ఇంకా 14వేలకు పైగా బస్తాల ధాన్యం ఈ కేంద్రంలో ఉంది. మంగళవారం పంపించిన లారీలో 700 బస్తాలు ఎగుమతి అయినా రోజుకు ఇలా ఒక లారీని పంపితే 20 రోజుల పాటు ధాన్యం తరలించాల్సి ఉంటుంది. అకాల వర్షాలు వెంటాడుతున్న నేపథ్యంలో రోజుకు నాలుగైదు లారీలను పంపించి నాలుగైదు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తల్లాడ మండలంలోని గొల్లగూడెంకు రెండు లారీలు పంపించగా కలకొడిమకు మాత్రం ఒక్క లారీని కూడా పంపించలేదు.
మందకొడి కొనుగోళ్లతో ఇబ్బందులు
ఒక్కో కేంద్రంలో వేలాది క్వింటాళ్ల ధాన్యం ఉంది. తారు రోడ్లు, రోడ్ల పక్కన ఖాళీ స్థలాలను కల్లాలుగా మార్చి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఆ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం ఆరబోశారు. ఇప్పటికే ఒక్కో రైతు రూ.5వేల విలువ చేసే పట్టాలను వడ్ల కింద పోసేందుకు పైనుంచి కప్పేందుకు తీసుకున్నారు. వడ్లలో తేమ తగ్గేందుకు నిత్యం తిరగబోయడానికి ఒక్కో కూలీకి రోజుకు రూ.800కు పైగా వెచ్చించాల్సి వస్తోంది. మందకొడి కొనుగోళ్ల కారణంగా తక్కువలో తక్కువగా ఒక్కో రైతుకు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు అదనపు ఖర్చు వస్తోందని రైతులు వాపోతున్నారు.
రూ.30వేలకు పైగా అదనపు ఖర్చు : కె.వినోద్‌రెడ్డి, బీరోలు
స్థానిక ఐకేపీ కేంద్రంలో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికీ ఒక్క లారీని మాత్రమే ఎగుమతి చేశారు. ‘నవతెలంగాణ’ పత్రికలో కథనం రావడంతో మంగళవారం మరో లారీ పంపారు. ఇలా ఒక్కో లారీ పంపితే ఇప్పట్లో కొనుగోళ్లు పూర్తి కావు. నాకు 80 క్వింటాళ్ల వడ్ల దిగుబడి వచ్చింది. రోజూ సాయంత్రమైతే వాతావరణం మబ్బులు పడుతోంది. అకాల వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రూ.15వేలు వెచ్చించి పట్టాలు తెచ్చాను. వడ్లు తిరగబోసేందుకు రోజుకు ముగ్గురు కూలీలను పెట్టాను. ఇప్పటికే రూ.30వేల ఖర్చు వచ్చింది. క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందని ప్రభుత్వానికి అమ్మితే అంతకుమించి ఖర్చు వస్తోంది. పచ్చివడ్లు ప్రయివేటుగా అమ్మితే రూ.1960 చొప్పున కొనేవాళ్లు. కేంద్రంలో అయితే క్వింటా రూ.2,320+500 బోనస్ కలిసి వస్తుందనుకుంటే ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోవట్లేదు.
హనుమకొండలో ప్రారంభం కాని బోనస్ చెల్లింపులు
హనుమకొండ జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 51,183 ఎకరాల్లో వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కోసం 152 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ 40 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. ఇందులో ఐకేపీకి సంబంధించి 45, పీఏసీఎస్‌లకు సంబంధించి 62 మొత్తం 107 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 23,239 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. అలాగే సన్నాలు 3,319 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. వీటిలో ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించి 38మంది రైతులకు చెందిన 178మెట్రిక్ టన్నులకు రూ.90లక్షలు బోనస్‌గా చెల్లించాల్సి ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా, 15 రోజులుగా కల్లాల్లోనే ధాన్యం ఉండటం, ఆ తర్వాత ధాన్యాన్ని తూకం వేస్తుండటంతో రైతులు నేరుగా మిల్లర్లకు ధాన్యాన్ని తక్కువ ధరకైనా అమ్ముకొని పోతున్నారు. సోమవారం నాటికి జిల్లాలో 50 శాతం మాత్రమే ఆన్‌లైన్ పేమెంట్ డేటాను నమోదు చేశారు. దాంతో చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది.
జూన్ 15 వరకు కొనుగోళ్లు.. : మహేందర్, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయిస్, హన్మకొండ జిల్లా
రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను జూన్ 15వ తేదీ వరకు కొనసాగిస్తాం. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పుంజుకుం టున్నాయి. బోనస్ చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాం.
తీరిన వడ్ల రైతు వ్యథలు
- Advertisement -
RELATED ARTICLES