Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణా సేవల్లో 'వాహన్‌'

రవాణా సేవల్లో ‘వాహన్‌’

- Advertisement -

మార్చి నుంచి కొత్త విధానం అందుబాటులోకి..
డీలర్‌ పాయింట్‌ రిజిస్ట్రేషన్లతో వేగవంతమైన ప్రక్రియ
మూడు విడతల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రవాణా శాఖ పౌరులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ‘వాహన్‌’ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రవాణా సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ‘డీలర్‌ పాయింట్‌ వాహన శాశ్వత రిజిస్ట్రేషన్‌’ సేవలను ప్రారంభించడం ద్వారా వాహన కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఇప్పటికే సారథి పోర్టల్‌ ద్వారా ప్రజలకు డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణాశాఖ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ముమ్మర ఏర్పాట్లు..ప్రత్యేక శిక్షణలు!
‘వాహన్‌’ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, సిబ్బంది, ఇప్పుడు షోరూం డీలర్లకు కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి మూడు విడతల్లో ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ శిక్షణలో భాగంగా ప్రతి జిల్లాలోని రవాణా కార్యాలయం నుంచి ‘మాస్టర్‌ ట్రైనర్లు’గా ఒక ఆర్టీవో, ఒక పరిపాలనా అధికారి, ఒక మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ లేదా అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు సీనియర్‌ లేదా జూనియర్‌ అసిస్టెంట్‌ను ఎంపిక చేశారు. ఈ మాస్టర్‌ ట్రైనర్లకు కొత్త సాఫ్ట్‌వేర్‌ పనితీరు, డేటా ఎంట్రీ, అప్లికేషన్ల ప్రాసెసింగ్‌ వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. వీరు తమ కార్యాలయాల్లోని మిగతా సిబ్బందికి శిక్షణ ఇచ్చి, అందరినీ కొత్త విధానానికి సన్నద్ధం చేస్తారు.

ప్రయోగాత్మక అమలు..
‘వాహన్‌’ పోర్టల్‌ మార్చి మూడు వారంలో అంటే 18 లేదా 20వ తేదీన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ ప్రయోగాత్మక అమలు ద్వారా తలెత్తే సమస్యలను గుర్తించి, వాటిని సరిదిద్దిన తర్వాత, అదే నెల చివరి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ‘వాహన్‌’ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫలితంగా వాహనదారులకు అన్ని రకాల రవాణా సంబంధిత సేవలు ఆన్‌లైన్‌లోనే లభిస్తాయి. ముఖ్యంగా ‘డీలర్‌ పాయింట్‌ రిజిస్ట్రేషన్‌’ సేవలు అందుబాటులోకి రావడంతో, కొనుగోలుదారులు నేరుగా డీలర్‌ పాయింట్‌ వద్దనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయగలుగుతారు. ఇది పౌరులకు సమయం ఆదా చేయడంతో పాటు, కార్యాలయాలకు వెళ్లే అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ మార్పుతో రవాణా శాఖ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని అధికారులు భావిస్తున్నారు.

‘వాహన్‌’ ద్వారా లభించే సేవలు
ప్రస్తుతం డేటా మైగ్రేషన్‌, టెస్టింగ్‌ ప్రక్రియలు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నెల నుంచి ‘వాహన్‌’ సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే.. వాహన రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ వంటి సేవలన్నీ కేంద్ర రవాణా శాఖ పోర్టల్‌ ద్వారానే జరుగుతాయి.

డీలర్లకు ప్రత్యేక శిక్షణ
‘వాహన్‌’ వ్యవస్థలోని ఒక కీలకమైన మార్పు ‘డీలర్‌ పాయింట్‌ వెహికల్‌ పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌’. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి రవాణా శాఖ నేడు(బుధవారం) హైదరాబాద్‌లో షోరూం డీలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ ద్వారా డీలర్లు తమ పాయింట్ల నుంచే కొత్త వాహనాలకు సంబంధించిన పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలుసుకొనున్నారు. ఇది వాహన కొనుగోలుదారులకు రవాణా కార్యాలయానికి వెళ్లే శ్రమను తగ్గిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -