సెకండ్ హ్యాండ్ వాహనాలపై పన్ను రద్దు!
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్ర రవాణా శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘వాహన్ పోర్టల్’ను ప్రారంభించనున్నట్టు రవాణా శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 23న రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
వాహన్ పోర్టల్ ప్రత్యేకతలు
కొత్త పోర్టల్ ద్వారా వాహనాలకు సంబంధించిన సమగ్ర సమాచారం దేశవ్యాప్తంగా ఒకే చోట లభ్యమవుతుంది. ఈ పోర్టల్‌తో తెలంగాణ రవాణా శాఖ అనుసంధానం కావడం వల్ల, రాష్ట్రంలోని వాహనాల వివరాలన్నీ జాతీయ డేటాబేస్‌లోకి చేరుతాయి. దీనివల్ల రవాణా శాఖ సేవలు మరింత వేగవంతం కావడమే కాకుండా, పారదర్శకత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
వాహనదారులకు ఊరట
వాహనదారులకు ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఇప్పటివరకు సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్లపై విధిస్తున్న 2శాతం జీవితకాలపు అదనపు పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ఈనెల 23 నుంచే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వాహన కొనుగోలుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించనుంది. ప్రజా సౌలభ్యం కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రవాణా శాఖ సేవలను మరింత సులభతరం చేయడమే కాకుండా, సామాన్యులకు ఎంతో మేలు చేకూరుస్తాయని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి.



