నవతెలంగాణ-హైదరాబాద్ : వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బిహార్ తరఫున సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం బాది రికార్డ్ సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇదే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ (190; 84 బంతుల్లో; 16 ఫోర్లు, 15 సిక్స్‌లు) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. క్రీజులో ఉన్నంత వరకు సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.
వైభవ్ వీరబాదుడుతో 30 ఓవర్లు ముగిసే సమయానికి బిహార్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మంగళ్ మహరూర్ 33 (43 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో పీయూష్ సింగ్ (37; 40 బంతుల్లో, 4 ఫోర్లు), ఆయుష్ లోహరుక (13; 14 బంతుల్లో, 2 ఫోర్లు) కొనసాగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో టెక్కీ నేరి రెండు వికెట్లు తీసుకున్నాడు.



