నవతెలంగాణ-హైదరాబాద్ : యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్‌ని ఝుళిపించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత్ అండర్-19 జట్టు మధ్య జరుగుతున్న రెండో యూత్ వన్డేలలో అర్థ శతకంతో రాణించాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. మూడు వన్డేలు, రెండు యూత్ ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు.
కెప్టెన్, మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (0) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. పరుగులు చేయకుండానే ఔట్ అయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన భారత్‌ను వన్ డౌన్ బ్యాటర్ విహాన్ మల్హాత్రాతో కలిసి, వైభవ్ చక్కదిద్దాడు. వైభవ్ 68 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 70 పరుగులు చేసి ఔట్ కాగా.. విహాన్ 74 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సుతో 70 పరుగులు చేశాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అభిజ్ఞాన్ కుందు 64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 71 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ యువ జట్టు 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు లక్ష్య చేధనలో ఉంది. 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.