Saturday, April 11, 2026
E-PAPER
Homeఆటలువైభవ్‌ ఊచకోత

వైభవ్‌ ఊచకోత

- Advertisement -

15 బంతుల్లోనే అర్థ సెంచరీ
ఛేదనలో రాణించిన జురెల్‌
బెంగళూరుపై రాజస్తాన్‌ గెలుపు
ఆర్‌సీబీ 201/8, రాయల్స్‌ 202/4

చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (78) ఆర్సీబీపై శివమెత్తాడు. సిక్సర్లు, ఫోర్లతో విశ్వరూపం దాల్చిన సూర్యవంశీ 15 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. 7 సిక్స్‌లు, 8 ఫోర్ల సహా 300 స్ట్రయిక్‌రేట్‌తో వైభవ్‌ ఊచకోత ఇన్నింగ్స్‌ ఆడాడు. ధ్రువ్‌ జురెల్‌ (81 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీతో రాణించటంతో 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ 18 ఓవర్లలోనే ఊదేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్‌సీబీపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది సీజన్లో వరుసగా నాల్గో విజయం ఖాతాలో వేసుకుంది.

నవతెలంగాణ-గువహటి
రాజస్తాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌19లో నాల్గో విజయం సాధించింది. శుక్రవారం గువహటిలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్తాన్‌ రాయల్స్‌ అజేయ జోరు కొనసాగిస్తోంది. యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (78, 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (81 నాటౌట్‌, 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. హాజిల్‌వుడ్‌పై రెండు సిక్సర్లు కొట్టిన యశస్వి జైస్వాల్‌ (13) అతడి ఓవర్లోనే వికెట్‌ పారేసుకున్నాడు. ధ్రువ్‌ జురెల్‌ జతగా వైభవ్‌ సూర్యవంశీ ఆర్‌సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. 15 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన సూర్యవంశీకి దండయాత్రలో జురెల్‌ సైతం జతకలిశాడు.

అభినందన్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో జురెల్‌ చెలరేగాడు. పవర్‌ప్లేలో 97/1తో ఉన్న రాయల్స్‌.. 8 ఓవర్లలో 129/1తో నిలిచింది. సూర్యవంశీ, జురెల్‌ జోడీ 37 బంతుల్లోనే 108 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షం చేసింది. సూర్యవంశీ, షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (0), రియాన్‌ పరాగ్‌ (3) వికెట్లతో ఆర్‌సీబీ పుంజుకునే ప్రయత్నం చేసింది. కానీ రవీంద్ర జడేజా (24 నాటౌట్‌), ధ్రువ్‌ జురెల్‌ ఐదో వికెట్‌కు అజేయ అర్థ సెంచరీ (68) భాగస్వామ్యంతో మరో 12 బంతులు ఉండగానే రాయల్స్‌ రాయల్‌ విక్టరీ అందుకుంది. ఆర్‌సీబీకి సీజన్లో ఇదే తొలి పరాజయం. ఛేదనలో విధ్వంసక ఇన్నింగ్స్‌ నమోదు చేసిన వైభవ్‌ సూర్యవంశీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

రాణించిన రజత్‌, అయ్యర్‌
వర్షం ప్రభావిత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఆరంభం కలిసిరాలేదు. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (0) డకౌట్‌ కాగా, దేవదత్‌ పడిక్కల్‌ (14), కృనాల్‌ పాండ్య (1), జితేశ్‌ శర్మ (5), టిమ్‌ డెవిడ్‌ (13) నిరాశపరిచారు. టాప్‌ ఆర్డర్‌లో విరాట్‌ కోహ్లి (32) ఒక్కడే రాణించాడు. పవర్‌ప్లేలో ఏడు బౌండరీలు బాదిన కోహ్లిని రవి బిష్ణోయ్ సాగనంపాడు. తొలి 6 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన బెంగళూరు.. 14 ఓవర్లలో 125/7తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో ఆర్‌సీబీ ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌ (29 నాటౌట్‌)ను తీసుకోవటం ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (63) 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో అర్థ సెంచరీతో కదం తొక్కాడు.

పాటిదార్‌ నిష్క్రమించినా.. రొమారియో షెఫర్డ్‌ (22)తో కలిసి అయ్యర్‌ పోరాడాడు. దీంతో ఆఖరు 6 ఓవర్లలో బెంగళూర్‌ 76 పరుగులు పిండుకుంది. చివరి ఓవర్లో సందీప్‌ శర్మపై రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ సహా 21 పరుగులు పిండుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌.. బెంగళూర్‌ స్కోరు 200 దాటించాడు. 20 ఓవర్లలో 8 వికెట్లకు ఆర్‌సీబీ 201 పరుగులు చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ (2/33), రవి బిష్ణోయ్ (2/32), బ్రిజేశ్‌ శర్మ (2/37) రాణించారు. ఇన్నింగ్స్‌లో సగానికి పైగా ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేసిన రాయల్స్‌ బౌలర్లు… డెత్‌ ఓవర్లలో పట్టు వదిలేశారు. ఫలితంగా వెంకటేశ్‌ అయ్యర్‌, షెఫర్డ్‌లు ధనాధన్‌తో పరుగుల వరద పారించారు.

సంక్షిప్త స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు : 201/8 (రజత్‌ పాటిదార్‌ 63, విరాట్‌ కోహ్లి 32, వెంకటేశ్‌ అయ్యర్‌ 29 నాటౌట్‌, రవి బిష్ణోయ్ 2/32, బ్రిజేశ్‌ శర్మ 2/37, జోఫ్రా ఆర్చర్‌ 2/33)
రాజస్తాన్‌ రాయల్స్‌ : 202/4 (ధ్రువ్‌ జురెల్‌ 81 నాటౌట్‌, వైభవ్‌ సూర్యవంశీ 78, రవీంద్ర జడేజా 24 నాటౌట్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌ 2/37, కృనాల్‌ పాండ్య 2/30)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -