పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వచ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ఎంపికైంది. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని అందించారు. తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రత్యేక ప్రివ్యూ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాష్, తన్నేరు బాబు రావు, నాగ మహేష్, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ, ‘కోటి మొక్కలు నాటి ప్రకృతికి సేవ చేసిన రామయ్య జీవితం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. త్వరలోనే భారతీయ భాషల్లో కూడా ఈ బయోపిక్‌ను తీసుకురానున్నాం’ అని తెలిపారు. సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ కూడా ఇదే భావనను వ్యక్తం చేస్తూ, ఈ చిత్రాన్ని ప్రకృతి ప్రేమికుడు రామయ్యకు నివాళిగా అంకితం చేస్తున్నామని చెప్పారు. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
”వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఊరూరూ తిరిగిన ఆయన, శుభకార్యాల్లో మొక్కలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా సరికొత్త ఆచారాన్ని నెలకొల్పారు. చెట్ల గింజలను సేకరించి అటవీ ప్రాంతాల్లో చల్లడం ఆయన నిత్యకృత్యంగా ఉండేది. ప్రకృతిని ప్రేమించిన ఆ మహానుభావుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకృతి ఒడిలో కలిసిపోయినప్పటికీ, ఆయన చూపించిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ బయోపిక్ ద్వారా ఆయన సేవలు, స్ఫూర్తి మరింత విస్తృతంగా ప్రజలకు చేరవ కానున్నాయి అని చిత్ర బృందం తెలిపింది. బ్రహ్మాజీ, నాగరాణి, నాగమల్ల మహేష్, శ్రీనివాస రాయుడు, భిక్షపతి, తిరుపతి సిద్దిపేట, శంకర్ దుబ్బాక, పైడిపల్లి చైతన్య, బుసం రవీంద్రనాథ్, మాస్టర్ రిషికేష్ బాబు, సురేష్‌బాబు గొడిశాల తదితరులు నటించిన ఈ చిత్రానికి రచయిత: డా.కళా రంగా, సంగీత దర్శకుడు: బల్లేపల్లి మోహన్.
పలు భారతీయ భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


