బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది
ఈ గేయాన్ని పాడినందుకు బ్రిటీష్ వారు అరెస్టు చేశారు
బీజేపీ, సంఘ్‌పరివార్ వ్యక్తులు ఒక్కరైనా అరెస్టయ్యారా? : రాజ్యసభలో అధికార బీజేపీని నిలదీసిన ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వందేమాతరం దేశ ప్రజల ఐక్యతకు దిక్సూచి అని, అయితే దానిపై బీజేపీ రాజకీయం చేస్తోందని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. అలాగే చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. దేశం బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు వందేమాతరం గేయం పాడినందుకు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు, దేశ ప్రజలు అరెస్టు అయ్యారని గుర్తుచేశారు. ఇలా ఒక్కరైనా బీజేపీ, నాటి సంఘ్‌పరివార్ వ్యక్తులు అరెస్టు అయ్యారా? అంటూ అధికార బీజేపీని ప్రతిపక్ష నేతలు నిలదీశారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ రాజ్యసభలో బుధవారం రెండో రోజూ కొనసాగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా ఈ చర్చను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య అని విమర్శించారు. బీజేపీ నేతలు నెహ్రూను అవమానించినప్పుడు, స్వాతంత్య్రపోరాటంలో పోరాడిన ప్రతిఒక్కరినీ అవమానించినట్టేనని అన్నారు. మన రాజకీయాల్లో చరిత్ర చాలా తక్కువ, మన చరిత్రలో రాజకీయాలు చాలా ఎక్కువని తెలిపారు. ప్రధాని మోడీ, హౌం మంత్రి అమిత్‌షా, ప్రభుత్వం వైపు ఉన్న ఇతర వక్తలను ప్రస్తావిస్తూ, వారు చరిత్రకారులుగా మారాలని నిర్ణయించుకున్నారని, కానీ ‘వక్రీకరించేవారు’ అయ్యారని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర నాయకులతో సహా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమిష్టి నిర్ణయం ప్రకారం వందేమాతరం ప్రస్తుత వెర్షన్‌ను ఉప యోగించారని అన్నారు.
వందేమాతరం, ఆనందమఠం చారిత్రక సందర్భాన్ని తెలుసుకోవాలి : ఎంపీ కపిల్‌సిబల్
వందేమాతరం గేయం రాజకీయంగా తప్పుడు సందర్భంలో ఉపయోగించబడు తోందని ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. వందే మాతరం, ఆనందమఠం చారిత్రక సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలన్నారు.’ఈ గేయం పశ్చిమ బెంగాల్ లో కరువు నేపథ్యంలో రాయబడింది. ఇది చాలా దృక్పథం, సందర్భతో వస్తుంది” అని ఆయన అన్నారు. ”అణచివేత ఉన్నచోట తిరుగుబాటు ఉంటుంది” అనే అర్థంలో ఆనంద్‌మఠం రాయబడింది” అని తెలిపారు. అణచివేతకు వ్యతిరేకంగా వందేమాతరం మనహక్కు అని ఆయన అన్నారు. వందేమాతరం రాజకీయ ప్రచారం కోసం రాయ లేదని కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె.మణి అన్నారు.
పార్లమెంటులో సంబంధిత చర్చలు జరపడానికి బదులుగా బీజేపీ దీనిని రాజకీయ ప్రచారంగా మారుస్తోందని విమర్శించారు. ఈ గేయం ప్రభుత్వ వైఫల్యాలను దాచదని అన్నారు. బీజేపీ మతం ఆధారంగా ప్రజలను విభజిస్తోందని సీపీఐ(ఎం) ఎంపీ ఎంఏ రహీం అన్నారు. దేశం ఐక్యతతో వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిందని, ఆనాడు ”మతం ఆధారంగా విభజన జరగలేదు” అని ఆయన తెలిపారు. కానీ బీజేపీ మతం ఆధారంగా ప్రజలను విభజిస్తోందని విమర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్య్ర పోరాటంపైనా ఇలాంటి చర్చ జరగాలని శివసేన ఎంపీ ప్రియాంకచతుర్వేది డిమాండ్ చేశారు. సరైన చరిత్ర నమోదుకు వందేమాతరంపై జరిగే ఈ చర్చను దేశ ప్రజలు ఆసక్తిగా వినాలని విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ ద్వారా చరిత్ర నేర్చుకునే వారు ఆగిపోయేలా క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్య్ర పోరాటంపై చర్చలు జరపాలని కూడా ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.



