Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాదులో వాన్‌గార్డ్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఏర్పాటు

హైదరాబాదులో వాన్‌గార్డ్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఏర్పాటు

- Advertisement -

– ఫ్యూచర్‌ సిటీలో వాన్‌గార్డ్‌ సొంత సెంటర్‌ను నిర్మించాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాదులో వాన్‌గార్డ్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. సోమవారం హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సెంటర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్‌ ఒక కేంద్రంగా మారిందని చెప్పారు. ఇక్కడ బలమైన మౌలిక వసతులు, వ్యాపారానుకూల విధానాలు, ప్రతిభతో నిండిన ఎకోసిస్టమ్‌ ఉన్నాయని చెప్పారు. ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు నాయకత్వంలో టెక్నాలజీ, పరిశ్రమల రంగాల్లో విశేష పురోగతి సాధిస్తున్నట్టు తెలిపారు. కొత్త అధ్యాయాన్ని ముందుకు నడిపించే వాన్‌గార్డ్‌ ప్రతిభాశాలి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాదులో భవిష్యత్తు సిటీగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఒక స్థలాన్ని తీసుకొని, వాన్‌గార్డ్‌ సొంత సెంటర్‌ నిర్మించే అంశంపై లోతుగా ఆలోచన చేయాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజరు కుమార్‌, కంపెనీ ప్రతినిధులు నితిన్‌ థండన్‌, వెంకటేష్‌, జాన్‌, కిమ్‌ తదితరులు పాల్గొన్నారు.

120 జీసీసీలు,1.2 లక్షల ఉద్యోగాలే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌ బాబు
వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ప్రారంభించి కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ లో స్కిల్లింగ్‌, రీ స్కిల్లింగ్‌, అప్‌ స్కిల్లింగ్‌లో అత్యుత్తమ నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్‌గార్డ్‌ తమ ‘గ్లోబల్‌ వ్యాల్యూ సెంటర్‌(జీవీసీ)’ ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఈ నగర సామర్థ్యానికి నిదర్శనమన్నారు. వాన్‌గార్డ్‌ ప్రపంచవ్యాప్తంగా 6.4 ట్రిలియన్‌ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని, అలాంటి సంస్థ మన దగ్గర కార్యకలాపాలు ప్రారంభించడం మనకు గర్వకారణమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -