Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంవీబీ-జీ రామ్‌ జీ బిల్లును వెనక్కి తీసుకోవాలి

వీబీ-జీ రామ్‌ జీ బిల్లును వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

ఉపాధి హామీని కాపాడాలి
ఈనెల 19న జాతీయ కార్యాచరణ దినంగా పాటించాలి : వ్యవసాయ కార్మిక సంఘాలు, మేధావుల పిలుపు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వీబీ-జీ రామ్‌ జీ బిల్లును తిరస్కరించాలని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, మేధావులు అన్నారు. డిసెంబర్‌ 19న జాతీయ కార్యాచరణ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. బుధవారం నాడిక్కడ ప్రెస్‌క్లబ్‌లో యోగేంద్ర యాదవ్‌ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు, మేధావులు మాట్లాడారు. ప్రతిపాదిత వికసిత్‌ భారత్‌ – గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీ-జీ రామ్‌ జీ) బిల్లును ఖండించారు. కార్మికులు, కార్మిక సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చట్టాన్ని రద్దు చేస్తుందని విమర్శించారు. ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై నడిచే ఒక కేంద్రీకృత, బడ్జెట్‌ పరిమితులతో కూడిన పథకంగా మారుస్తుందని దుయ్యబట్టారు.

సంక్షోభ సమయాల్లో ఉపాధి హామీది కీలకపాత్ర
గ్రామీణ సంక్షోభ సమయాల్లో హామీ ఇవ్వబడిన ఉపాధి హామీ హక్కు కీలక పాత్రను జేఎన్‌యూ ప్రొఫెసర్‌, కేరళ ప్రణాళిక బోర్డు మాజీ వైస్‌ చైర్మెన్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ నొక్కి చెప్పారు. రాజస్థాన్‌లోని బీవార్‌కు చెందిన వితంతువు కమలాదేవి 18 ఏండ్లుగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో పని చేస్తున్నారని అన్నారు. ఆమె భర్త మరణించినప్పుడు, ఆమెకు భూమి లేదా పిల్లలు లేనప్పుడు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ తన ఏకైక ఆదాయ వనరని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లేకుండా ఆమె ఎలా బతుకుతారు?” అని అన్నారు.

కొత్త బిల్లుతో ప్రమాదాలు
కొత్త బిల్లుతో దేశంలో సమాఖ్యవాదానికి ఎదురయ్యే తీవ్ర ప్రమాదా గురించి ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌ వివరించారు. ముఖ్యంగా ప్రతిపక్ష రాష్ట్రాలకు వ్యతిరేకంగా నిధులను ఆయుధంగా ఉపయోగించే కేంద్రం ధోరణిని దృష్టి లో ఉంచుకుని ఈ బిల్లును రూపొందించారని అన్నారు. అయితే కొత్త బిల్లు వర్తించే ప్రాంతాలు, పనుల షెల్ఫ్‌ను నిర్ణయించడానికి కేంద్రానికి పూర్తి అధికారాలను ఇస్తుందని తెలిపారు. ఈ బిల్లులో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటంటే, కేంద్రం బడ్జెట్‌పై పరిమితిని విధిస్తుందని అన్నారు. అంతకుమించి రాష్ట్రాలు ఈ పథకానికి వంద శాతం నిధులు సమకూర్చాల్సి ఉంటుందని తెలిపారు. ఇది ఉపాధి హామీ ఎక్కువగా అవసరమయ్యే పేద రాష్ట్రాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి
”ఏ చట్టం వల్ల భారతదేశాన్ని విశ్వగురువు అని పిలవవచ్చో, అది ఎన్‌ఆర్‌ఈజీఎస్‌” అని ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త జీన్‌ డ్రెజ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త బిల్లు కింద కేంద్రానికి కల్పించిన ప్రమాదకర విచక్షణాధికారాలను డ్రెజ్‌ వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ విషయంలో ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వివరించారు. 2021 నుంచి బెంగాల్‌లో పనుల నిలిపివేత, వివక్షాపూరిత సాంకేతిక చర్యలు, నిధుల కోతలు వంటి అంశాలను గుర్తు చేశారు. కొత్త బిల్లును వెనక్కి తీసుకుని, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను బలోపేతం చేసే వరకు తాము నిరసనలు ఆపబోమని ఉపాధి కూలీ శ్రావణి దేవి మాటలను డ్రెజ్‌ పునరుద్ఘాటించారు.

కూలీలకు, రైతులకు మధ్య తప్పుడు విభజన సృష్టించేందుకు ప్రభుత్వం యత్నం
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్మికులకు, రైతులకు మధ్య తప్పుడు విభజన సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవా నికి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ దేశంలో వ్యవసాయ పనులపై ప్రతికూల ప్రభావం చూపడం లేదని, చిన్న రైతులు, చేతివృత్తుల వారు తమ పోరాటంలో కార్మికులకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈ కొత్త బిల్లు దేశంలో కొత్త బానిస, భూస్వామ్య వ్యవస్థను సృష్టిస్తుందని, గ్రామీణ వేతనాలపై ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ చూపిన సానుకూల ప్రభావాలను బలహీనపరుస్తుందని అన్నారు.

కొత్త బిల్లుతో ఉపాధి హక్కు నిర్వీర్యం
కొత్త బిల్లు ఉపాధి హక్కును నాశనం చేస్తుందని ఎంకెఎస్‌ఎస్‌ నేత ముఖేష్‌ నిర్వాసిత్‌ అన్నారు. రాజస్థాన్‌లోని బివార్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్మికురాలు శ్రావణి దేవి మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను ప్రజలే సాధించుకున్నారని, దానిని రద్దు చేయడానికి ప్రజలు అంగీకరించబోరని అన్నారు. ”మేము వీధుల్లోకి వస్తాము, కార్మికుల శక్తిని ప్రభుత్వం తక్కువ అంచనా వేయకూడదు” అని ఆమె హెచ్చరించారు. ఎంపీలు శశికాంత్‌ సెంథిల్‌ (కాంగ్రెస్‌), మనోజ్‌ కుమార్‌ ఝా (ఆర్‌జేడీ), కనిమొళి (డీఎంకే), లావు శ్రీ కృష్ణదేవరాయలు (టీడీపీ)లతో వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు కలిసి ఈ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మహిళలకు సమాన వేతనం, ఆర్థిక స్వేచ్ఛను అందించడంతో వారి జీవితాలు మెరుగుపడ్డాయని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఉపాధ్యక్షురాలు అన్నీ రాజా అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు దారితీసిన చారిత్రాత్మక పోరాటం గురించి వివరించారు. దీని కోసం మహిళలు, అణగారిన వర్గాలు, యువత వంటి సమాజంలోని అన్ని వర్గాలు పోరాడాయని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -