Wednesday, March 4, 2026
E-PAPER
Homeజాతీయంవీబీ-జీ ఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలి

వీబీ-జీ ఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలి

- Advertisement -

గ్రామీణ ఉపాధి రక్షణకు ఐక్యపోరాటం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ రక్షణకై ఐక్యపోరాటం చేస్తామని అన్నారు. సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీని ‘జాయింట్‌ ప్లాట్‌ఫామ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ వర్కర్స్‌ యూనియన్స్‌’ అండ్‌ ‘నరేగా (ఎన్‌ఆర్‌ఈజీఏ) సంఘర్ష్‌ మోర్చా’ ప్రతినిధి బృందం కలిసి, ఈ నెల 17న జరగనున్న సదస్సుకు ఆహ్వానించింది. మోడీ ప్రభుత్వం గ్రామీణ పేదల పొట్టగొడుతూ, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ సంఘర్ష్‌ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమానికి సీపీఐ(ఎం) తన పూర్తి మద్దతును ఆయన ప్రకటించారు.

2005 నాటి చారిత్రాత్మక ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) అటకెక్కిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన ‘విక్షిత్‌ భారత్‌-గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌’ (వీబీజీఆర్‌ఏఎంజీ) చట్టం కేవలం కేంద్రంచేతిలో ఒక కీలుబొమ్మలా మారిందని దుయ్యబట్టారు. ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, పంచాయతీల అధికారాలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. కొత్త చట్టం ప్రకారం పనుల ఎంపికలో గ్రామ సభల ప్రాధాన్యతను తగ్గించి, కేంద్రమే పెత్తనం చేస్తోందని అన్నారు. వ్యవసాయ పనుల సాకుతో 60 రోజుల పాటు ఉపాధిని నిలిపివేసే నిబంధన గ్రామీణ పేదలను ఆకలి తీరాలకు నెట్టడమేనని అన్నారు. ఉపాధి హామీని కాపాడు కునే ఈ ప్రజాపోరాటంలో తమ పార్టీ పూర్తిస్థాయిలో పాల్గొంటుందని స్పష్టం చేశారు.

గ్రామీణ భారతాన్ని కాపాడుకోవడానికి, కూలీల హక్కుల రక్షణ కోసం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని సంయుక్త వేదిక ప్రకటించింది. ప్రజా వ్యతిరేక వీబీజీఆర్‌ ఏఎంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, పటిష్టమైన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఏడాదికి కనీసం 200 రోజులు పని కల్పించాలని, రోజువారీ కనీస వేతనం రూ.700కి పెంచి, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరించాలని డిమాండ్‌ చేశారు. హాజరు, చెల్లింపుల పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్న సాంకేతిక ఆంక్షలను తక్షణమే తొలగించాలన్నారు. గ్రామసభలను బలోపేతం చేసి, పనుల నిర్వహణలో వాటికి పూర్తి అధికారాలు కల్పించాలని అన్నారు. ఈ బృందంలో కార్మిక నేతలు బి. వెంకట్‌, అనురాధ తల్వార్‌, నిర్మల్‌, విక్రమ్‌ సింగ్‌, మురళీధరన్‌, వినీత్‌, దియా, సాహిల్‌, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -