Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంవీబీ-జీఆర్‌ఏఎంజీ ఒక జుమ్లా

వీబీ-జీఆర్‌ఏఎంజీ ఒక జుమ్లా

- Advertisement -

ఇది వ్యవసాయ కార్మికుల హక్కులపై దాడి
జాతీయ సదస్సులో వక్తలు
125 రోజుల పని ఇస్తామన్న వాగ్దానం డొల్ల : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అమ్రారామ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

వీబీ-జీఆర్‌ఏఎంజీ ఒక జుమ్లా అని, ఇది వ్యవసాయ కార్మికుల హక్కులపై దాడి అని వక్తలు అన్నారు. ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, బలోపేతం చేసిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏని తిరిగి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి గ్రామీణ కుటుంబానికీ ఉపాధిని కనీసం 200 రోజులకు పెంచాలని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎంపీలు, ఆర్థికవేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఉపాధి హామీ కార్మికులతో వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాలు, ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా ఐక్య వేదిక పాలసీ డైలాగ్‌ నిర్వహించింది. ఇటీవల ప్రవేశపెట్టిన వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (గ్రామీణ) (వీబీ-జీఆర్‌ఏఎంజీ) చట్టం, 2025 దృష్ట్యా భారత గ్రామీణ ఉపాధి హామీ పథకం భవిష్యత్తుపై చర్చించింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, లోక్‌సభ ఎంపీ అమ్రారామ్‌ మాట్లాడుతూ… మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసిన వీబీ-జీఆర్‌ఏఎంజీ పథకంలో 125 రోజుల పని ఇస్తామన్న వాగ్దానం డొల్ల అని విమర్శించారు. కనీసం వంద రోజుల పని కూడా కల్పించలేని వారే 125 రోజుల పని కల్పిస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో రూ.15 లక్షలు ఇస్తామని చేసిన వాగ్దానం లాగే ఇది కూడా ఒక వట్టి హామీ అని అమ్రారామ్‌ అన్నారు. రాజ్యసభ ఎంపీ వి. శివదాసన్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని తొలగించడంతో వారు (కేంద్రం) గాంధీ ఆలోచనలను నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశ గ్రామీణ పేదల జీవనాధారమైన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులను సమావేశం ఖండించింది. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించింది. ఉపాధి హామీ చట్టంలో ఉన్న హక్కులను తగ్గించడం, పనిదినాల గ్యారంటీని దెబ్బతీయడం, నిరుద్యోగ భృతి హక్కును నిర్వీర్యం చేయడంతో గ్రామీణ పేదల జీవనాధారంపై నేరుగా దాడి జరుగుతోందని తెలిపింది. కనీస వేతనం రూ.700గా నిర్ణయించి, దానిని ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరించాలని, హాజరు, వేతన చెల్లింపుల కోసం వాడుతున్న, కార్మికులను మినహాయించే సాంకేతిక వ్యవస్థలను ఉపసంహరించుకోవాలని సమావేశం డిమాండ్‌ చేసింది. పనుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణలో గ్రామసభల పాత్రను పునరుద్ధరించి బలోపేతం చేయాలని తెలిపింది.

మే 15న సమ్మెతో పాటు పంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు
దేశవ్యాప్తంగా ఉపాధి కార్మికులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, మే 15న సమ్మెతో పాటు పంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు, ముట్టడులు నిర్వహించాలని సమావేశం పిలుపునిచ్చింది. ఎంపీల సంతకాలతో ప్రధానమంత్రికి వినతి, పార్లమెంట్‌లో నిరసనలు చేపట్టడం వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. కనీసం 160 మంది ఎంపీల సంతకాలతో ప్రధానమంత్రికి మెమోరాండం సమర్పిస్తామని సదస్సులో ఐక్యవేదిక స్పష్టంగా ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ అఖిల భారత ఉద్యమానికి మద్దతు ప్రకటించడం సదస్సు విశేషంగా స్వాగతించింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీ ఏ పునరుద్ధరణ, విస్తరణ జరిగే వరకు దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బి. వెంకట్‌ అధ్యక్ష వర్గం తరఫున ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎంపీలు జ్యోతిమణి, శశికాంత్‌ సెంథిల్‌ (కాంగ్రెస్‌), అరుణ్‌ నెహ్రూ (డీఎంకే), రాజా రామ్‌ సింగ్‌ (సీపీఐ ఎంఎల్‌), రాజ్‌ కుమార్‌ రావు (భారత్‌ ఆదివాసీ పార్టీ), సంజరు యాదవ్‌, మనోజ్‌ ఝా (ఆర్జేడీ) కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -