రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
‘ఉపాధి’ చట్టాన్ని రక్షించుకోవాలంటూ పిలుపు
బిల్లు ప్రతుల దహనం
నవతెలంగాణ- విలేకరులు
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలని నినదించారు. వీబీ జీ రామ్ జీ బిల్లు ప్రతులను దహనం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నల్లబ్యానర్‌తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఉపాధిహామీ చట్టాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అంబ్కేదర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. నల్లగొండ మండలం అప్పాజిపేటలో నిరసన తెలిపారు. నకిరేకల్‌లో అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద బిల్లు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఆదిలాబాద్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, వీబీజీ రాంజీ పేరుతో కొత్త బిల్లు తీసుకురావడంపై కరీంనగర్‌లోని స్థానిక గీతా భవన్ చౌరస్తాలో నిరసన తెలిపారు. (వికసిత్ భారత్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ) వీబీ జీ రామ్ జీ బిల్లు ప్రతులను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. పరిగి పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద బిల్లు ప్రతులను దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వీబీ జీ రామ్‌జీ బిల్లు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.



