బీజేపీ వర్క్‌షాపులో ఎన్. రాంచందర్ రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వీబీ జీ రామ్ జీ చట్టం పారదర్శకతకు ప్రతీక అని బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. దశాబ్దాలుగా వచ్చిన ప్రతి పథకంలో నిర్మాణాత్మక లోపాలు, లీకేజీలు, అవినీతి వల్ల పేదలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకే పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆధునిక సాంకేతికతతో ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. మారుతున్న ఆర్థిక స్థితిగతులకనుగుణంగా పాత సంక్షేమ మోడళ్లలో మార్పులు అవసరమని తెలపారు. అందుకే వీబీ జీ రామ్ జీ అవసరమే కాకుండా అనివార్యమని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ లేదా ఇందిరాగాంధీ పేర్లకు బదులుగా హైదరాబాద్ విమానాశ్రయానికి మహాత్మాగాంధీ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 100 శాతం అన్‌స్కిల్డ్ వేతనాలను భరించడం వల్ల, రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత లేకుండా వ్యవహరించాయని విమర్శించారు.
వేతనాల కృత్రిమ పెంపు, భారీ లీకేజీలు చోటుచేసుకున్నాయన్నారు. దీని ద్వారా రాష్ట్రాల బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ, జవాబుదారీతనం పెరుగుతాయని చెప్పారు. ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంపు, కనీసం 50శాతం పనులు గ్రామ పంచాయతీల ద్వారా అమలు, గ్రామసభలు, గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల నిర్మాణం, జీవనోపాధి ఆధారిత పనులు, విపత్తు నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్‌కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్.గౌతమ్‌రావు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, సీనియర్ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, పాపయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వీబీ జీ రామ్ జీ చట్టం పారదర్శకతకు ప్రతీక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



