Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంవీబీజీ రామ్‌జీ బిల్లుపై ఆగ్రహం

వీబీజీ రామ్‌జీ బిల్లుపై ఆగ్రహం

- Advertisement -

ఏకపక్ష ఆమోదానికి నిరసనగా కాపీలు చించి ప్రతిపక్షాల ఆందోళన
గాంధీ పేరు తొలగించి అవమానిస్తున్నారని ధ్వజం..బాపూజీ విగ్రహం నుంచి మకర్‌ ద్వారం వరకు ప్రదర్శన

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో ‘ వీబీ జీ రామ్‌ జీ ‘ పేరుతో తీసుకువచ్చిన బిల్లుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం జేపీసీ, లేదా స్టాండింగ్‌ కమిటీకి పంపాలనే ప్రతిపక్షాల అభ్యర్థనలు, సూచనలను పట్టించుకోకుండా బిల్లును ఏకపక్షంగా ఆమోదించేందుకు కేంద్రం యత్నించడంతో తీవ్ర ఆందోళనకు దిగాయి. బిల్లు కాపీలను చించి వేసి తమ నిరసనను తెలిపాయి. లోక్‌సభలో బుధవారం అర్థరాత్రి వరకు ఈ బిల్లుపై చర్చ జరిగింది. చివరికి సమయం మించిపోవడంతో సభను వాయిదా వేశారు. దీంతో బిల్లుపై జరిగిన చర్చకు గురువారం కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సమాధానం ఇచ్చారు. ఆయన బిల్లును సమర్థిస్తూ మాట్లాడారు. అనంతరం బిల్లును సభ ముందు ఆమోదానికి పెట్టారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా బిల్లు ఆమోదం కోసం ప్రకటన చేశారు. దీంతో ప్రతిపక్షం ఒక్కసారిగా ఆందోళనకు దిగింది.

ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. మోడీ సర్కార్‌ ఏకపక్ష చర్యలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాల హౌరెత్తించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించిపైకి విసిరారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. వెంటనే సభను స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారానికి వాయిదా వేశారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, ఎస్‌పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌, సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్ తదితరులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాధి చట్టానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడమంటే, జాతిపితను అవమానించడమేనని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుతో రాష్ట్రాలపై మరింత భారం పడుతుందని విమర్శించారు.

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసన ప్రదర్శన
పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలోనే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే బిల్లును ఉపసంహరించు కోవాలని నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ అనే భారీ బ్యానర్‌తో ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్‌లోని ప్రేరేపణ స్థల్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి మకర్‌ ద్వారం వరకు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నినాదాలతో ప్రదర్శన నిర్వహించాయి. అనంతరం ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ చర్యను పార్లమెంట్‌లోనూ, దేశంలో గ్రామ గ్రామాన తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీని అవమానించడమే కాకుండా, దేశంలోని గ్రామాల్లో సామాజిక, ఆర్థిక పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పని హక్కును కూడా అణచివేస్తోందని విమర్శించారు.

ఈ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని, ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో ప్రజాస్వామ్య విలువలను, జాతిపిత భావాజాలాన్ని హత్య చేసేందుకు యత్నిస్తోందని అన్నారు. ”బిల్లులోని వివరాలను చదివిన ఎవరికైనా గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎలా పూర్తి కాబోతుందో అర్థమవుతుంది. ఈ బిల్లు వల్ల రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం పేదలకు అండగా ఉండేది. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పేదలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది’ అని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ కేసీ వేణుగోపాల్‌, డీఎంకే ఎంపీలు కనిమొళి, టీఆర్‌ బాలు, ఎ.రాజా, సీపీఐ(ఎం) ఎంపీలు అమ్రారామ్‌, కె.రాధా కృష్ణన్‌, జాన్‌ బ్రిట్టాస్‌, వి.శివదాసన్‌, ఎఎ రహీమ్‌, శివసేన ఎంపీ అరవింత్‌ సావంత్‌, ఎస్‌పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌, ఐయూఎంఎల్‌ ఎంపీ ఈటీ మహమ్మద్‌ బషీర్‌, ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కె ప్రేమచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -