Saturday, April 11, 2026
E-PAPER
Homeబీజినెస్అదానీ బిడ్‌పై వేదాంత సవాల్‌

అదానీ బిడ్‌పై వేదాంత సవాల్‌

- Advertisement -

– ఎన్‌సీఎల్‌టీలో వాదనలు
న్యూఢిల్లీ :
జైప్రకాష్‌ అసోసియేట్స్‌ లిమిటెడ్‌ (జెఎఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియ (ఐబీసీ)లో భాగంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బిడ్‌ను ఎంపిక చేయడాన్ని మైనింగ్‌ దిగ్గజం వేదాంత గ్రూప్‌ ఎన్‌సీఎల్‌టీలో సవాలు చేసింది. అదానీ సమర్పిం చిన రూ.14,535 కోట్ల బిడ్‌ కంటే తమ ఆఫర్‌ స్థూల విలువ రూ.3,400 కోట్లు, నికర విలువలో రూ.500 కోట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ రుణదాతల కమిటీ తక్కువ ధరకే మొగ్గు చూపడంపై వేదాంత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రుణదాతలు అనుసరించిన మూల్యాంకన పద్ధతులు పారదర్శకం గా లేవని.. ఆస్తుల విలువను గరిష్టం చేయాలనే దివాలా చట్టం ప్రధాన లక్ష్యాన్ని పక్కన పెట్టి అసంబద్ధమైన స్కోరింగ్‌ పద్ధతులతో తమను తప్పిం చారని వేదాంత తరపు న్యాయవాది వాదిం చారు. మరోవైపు రుణదాతల కమిటీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మొత్తం ప్రక్రియ ఐబిసి నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేసింది. కేవలం అత్యధిక ధర కోట్‌ చేసినంత మాత్రాన బిడ్‌ దక్కదని.. నగదు లభ్యత, ప్రాజెక్టును అమలు చేయగల సామర్థ్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది. దాదాపు రూ.57,185 కోట్ల అప్పుల్లో ఉన్న జేఏఎల్‌ గ్రూప్‌నకు నోయిడాలో విలువైన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, సిమెంట్‌ ప్లాంట్లు, హోటళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎన్‌సీఎల్‌టీలో విచారణలో ఉండగా తుది తీర్పు వచ్చే వరకు ఈ కొనుగోలు ప్రక్రియ ట్రిబ్యునల్‌ పరిధిలోనే కొనసాగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -