తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ఘన విజయాలను సాధించిన అగ్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.
ఆయన దర్శకత్వం వహించబోతున్న 43వ సినిమా ‘వేదవ్యాస్’. గురువారం ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది.
కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. హీరోయిన్ జున్ హ్యున్ జీ, నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుపై చిత్రీకరించిన తొలి షాట్‌కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ ప్రారంభోత్సవంలో నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్, కెమెరామెన్ శరత్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ,’ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటాయి. మంచి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. అలాంటి చిత్రాలు నేటి సమాజానికి అవసరమని భావించి ఆయనతో ఈ మూవీ నిర్మిస్తున్నాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు.
నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ”వేదవ్యాస్’ అనేది కృష్ణారెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ మూవీకి పరిపూర్ణత వచ్చేందుకు ఎలాంటి నటీనటులు ఉండాలో అలాంటి వారినే ఎంచుకున్నారు. విలన్‌గా మంగోలియన్ ఆర్టిస్ట్‌ను సెలెక్ట్ చేసుకున్నాం. విలన్ చాలా డిఫరెంట్‌గా ఉంటారు. కృష్ణారెడ్డి ఫుల్‌ఫ్లెడ్జ్‌గా మ్యూజిక్ ఆల్బం రెడీ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ చేస్తాం’ అని తెలిపారు.
నేను అదృష్టవంతుడిని, మీ అందరి ఆదరణతో 43వ సినిమాగా ‘వేదవ్యాస్’ చేస్తున్నాను. నా లైఫ్‌లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్ని సినిమాలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో చేస్తాను. తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్‌ను పరి చయం చేస్తున్నాం. జున్ హ్యున్ జీ మా మూవీలో నటించడం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచినా, మా టీమ్ అందరికీ మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తున్నా.
– దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి