నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శం అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. బుధవారం ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశం మందిరంలో వర్ధంతి కార్యక్రమం లోకలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి తో కలిసి వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఐలమ్మ సేవలు మరువలేనివి అని అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి అని కొనియాడారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, వెనుకబడిన తరగతుల జిల్లా అధికారి సాహితీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి,వివిధ కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది లు పాల్గొన్నారు.