Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇక ఆన్‌లైన్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్‌

ఇక ఆన్‌లైన్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్‌

- Advertisement -

పేపర్‌ పత్రాలతో పనిలేదు
కీలక నిర్ణయం తీసుకున్న రవాణాశాఖ
నేటి నుంచి కొత్త నిబంధన అమలులోకి..

నవతెలంగాణ-సిటీబ్యూరో
వాహన కొనుగోలుదారులకు, డీలర్లకు రవాణా శాఖ గుడ్‌న్యూస్‌ తెలిపింది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, పారదర్శకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డీలర్‌ పాయింట్‌ రిజిస్ట్రేషన్‌లో భాగంగా అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత పద్ధతికి స్వస్తి పలుకనుంది. నేటి నుంచి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎందుకీ మార్పు?
ఈ ఏడాది జనవరి 24 నుంచి రవాణాశాఖలో డీలర్‌ పాయింట్‌ రిజిస్ట్రేషన్‌ విధానం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాన్‌-ట్రాన్స్‌పోర్ట్‌ మోటార్‌ సైకిళ్లు, కార్ల రిజిస్ట్రేషన్‌ కోసం వాహనాన్ని నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే డీలర్లు ఫాం-20 సహా ఇతర పత్రాలను ఫిజికల్‌ కాపీల రూపంలో స్పీడ్‌ పోస్ట్‌ లేదా కొరియర్‌ ద్వారా ఆర్టీఏ కార్యాలయాలకు పంపాల్సి వచ్చేది. ఈ పద్ధతి వల్ల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోందని రవాణాశాఖ గుర్తించింది. దీంతో ఈ ప్రక్రియను డిజిటలైజ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే పూర్తి బాధ్యత డీలర్లదే..
నేటి నుంచి డీలర్లు ఎలాంటి ఫిజికల్‌(పేపర్‌) పత్రాలనూ ఆర్టీఏ కార్యాలయాలకు పంపకూడదు. యజమాని, ఫైనాన్షియర్‌(అవసరమైతే) సంతకాలతో కూడిన ఫాం-20, ఇతర పత్రాలను స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అంతేగాక ఈనెల 13వ తేదీకి ముందు టెంపరరీ రిజిస్ట్రేషన్‌(టీఆర్‌) పొందిన వాహనాలకు కూడా ఈ ఆన్‌లైన్‌ సదుపాయాన్ని కల్పించారు. డీలర్ల నుంచి ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులను అధికారులు గరిష్టంగా రెండు పని దినాల్లోపే పరిశీలించి ఆమోదించాలి. ఆలస్యమైతే సంబంధిత అధికారులపై చర్యలుంటాయి. డీలర్లు తమ వద్ద దరఖాస్తులను 7 రోజులకు మించి పెండింగ్‌లో ఉంచకూడదు.

ఉల్లంఘిస్తే వారి లాగిన్‌ నిలిపివేయడమే కాకుండా, కఠిన చర్యలు తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో పత్రాలను అప్‌లోడ్‌ చేసే పూర్తి బాధ్యత డీలర్లదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల వాహనదారులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, సమయం ఆదా అవుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని అధీకృత ఆటోమొబైల్‌ డీలర్లందరూ ఈ మార్పులను గమనించి, నేటి నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని మాత్రమే అనుసరించాలని రవాణా కమిషనర్‌ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -