‘చిన్ననాటి నా బాల్యం/ చిరునవ్వుల జ్ఞాపకం’ అంటూ మురిపించిన తన బాల్యాన్ని, ఆ బాల్యంలోని మధురిమలు, యాదులు, దోస్తులు, అనురాగాలు, అనుభూతులు ఇలా అనేక విషయాలు, అంశాలను కవిత్వం చేసిందో బాల కవయిత్రి. విద్యుత్ కాంతుల వెలుగుల నేల మన పెద్దపల్లి జిల్లా నుండి కవయిత్రిగా, రచయిత్రిగా రాణించింది చిన్నారి వేల్పుల శ్రీలత. ఈమె 29 జులై, 2009న ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని బొట్ల వనపర్తిలో పుట్టింది. ఇప్పుడిది పెద్దపల్లి జిల్లాలో భాగం. శ్రీలత తల్లితండ్రులు శ్రీమతి వేల్పుల శారద – వేల్పుల రాజేశం.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింహులపల్లిలో పదవ తరగతి చదువుతున్నప్పుడే బాల కథారచయిత్రిగా రచనలు అచ్చువేసింది. కవయిత్రిగా కవిత్వం రాసింది. నిజానికి ఎనమిదవ తరగతి నుండే రచనలు చేయడం మొదలుపెట్టింది. ఈ బాల సరస్వతి కవితలు, కథలు, ఇతర రచనలు వివిధ పత్రికల్లో వచ్చాయి. ఈ చిన్నారిలోని శక్తిని, రచన చేసే లక్షణాన్ని గమనించి పెన్నుపట్టుకుని నడిపించింది ఆమెకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడు, తెలంగాణలో జరుగుతున్న బాల వికాసోద్యమంలో ‘నేను సైతం’ అంటూ పాల్గొని చక్కని పనులు చేసిన కందుకూరి భాస్కర్. భాస్కర్ కవి, రచయిత, వ్యాసకర్త, చక్కని పరిశోధకుడు కూడా. తన మార్గదర్శనంలో కథా రచనలు చేసిందీ చిన్నారి. బాలకవిగా అక్షరయాన్ సంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటీలో ‘నా బాల్యం’ కవితకు తృతీయ బహుమతిని అందుకున్న శ్రీలత 2023లో ప్రముఖ బాల సాహితీవేత్త పెందోట నిర్వహించిన పెందోట బాల సాహిత్య పీఠం అవార్డు అందుకుంది. అదే ఏడాది ఖమ్మం నుండి ఉరిమళ్ళ సునంద ఆధ్వర్యంలోని ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పుస్తక సమీక్షల పోటీల్లో ఉత్తమ సమీక్ష అవార్డు గెలుచుకుంది. డా. వి.ఆర్. శర్మ నిర్వహించిన లీలావతి దవే సైన్స్ కథల పోటీల్లోనూ ఉత్తమ కథ పురస్కారం ఈ అమ్మాయికి లభించింది. ఇంకా బాలల పత్రిక ‘గడుగ్గారు’ వారు నిర్వహించిన పోటీలలోనూ బహుమతి అందుకోవడం విశేషం. అనేక కార్యక్రమాలు, సదస్సులు, కవి సమ్మేళనాల్లోనూ ఈ చిన్నారి పొల్గొంది. ఇప్పుడు కరీంనగర్‌లోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయాలి, ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి తొంభయ్యవ దశకం చివరలో చిరంజీవి గొంటి ప్రసస్న తెలుగు కవితల సంపుటి ‘మొగ్గలు’, ఆంగ్ల కవిత్వం ‘రెయిన్‌బో’ వెలువడింది. ఇప్పుడీ అమ్మాయి డాక్టర్‌గా విదేశాల్లో స్థిరపడింది. రెండున్నర దశాబ్దాకు ముందే ఈ నేల మీద బాలల రచనలు వెలువడ్డాయి. ఇవ్వాళ మళ్ళీ ‘దోస్తుల కథల వేల్పుల’ కొత్తగా కనిపంచడం సంతోషాన్ని కలిగించే ముచ్చట. శ్రీలత కథల సంపుటి తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే ‘నిజమైన స్నేహితులు’ పేరుతో వచ్చింది. ఇది పన్నెండు కథల ముల్లె. దీనిని వదాన్యులు ఏనుగు దయానందరెడ్డి పుస్తకంగా తెచ్చారు. జయహో! రెడ్డి సాబ్! ఇక శ్రీలత కథల ముచ్చట చూద్దాం! పిల్లలకు ఏంకావాలో తెలుసు, ఏం రాయాలో కూడా తెలుసు. మన చిన్నప్పుడు చందమామ కథల్లోని రామాపురాలు, రంగాపురాలు ఈ తరానికి అంతగా తెలియదు. ‘స్నేహితురాలి సలహా’ అనే కథ ఇందులో ఉంది. ఇది ఎంతగొప్ప విషయాన్ని చెబుతుందో తెలుసా.. అవును అదే మన సర్కారు బడిని గురించి. తాను చదివిన బడికి ఎంత కావ్యగౌరవాన్నిచ్చిందీ చిన్నారి. బాలబాలికలకు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మరోదానితో దాన్ని బేరీజు వేయడమో పోల్చి చూడడమో చేస్తుంటాం. అటువంటి కథే ‘చిలుక మాటలు’. ఇందులో అంతగా అర్థంకానిది ఏమీ లేదు. కొమ్మలున్న జామచెట్టు, కొమ్మలు కాక కేవలం ఆకులుండే అరటి చెట్టుల గురించి ఉంటుంది. పరులకోసం పాటుపడే తరువులన్నీ వాటి వాటి స్వభావం ప్రకారంగా ఉంటాయని ఎంత బాగా చెబుతుందో రచయిత్రి. చెట్టును గురించి, అందరికి సహకరించే చెట్టును కాపాడిన పక్షుల గురించి ఇందులో ఉంటుంది. ‘నిజమైన స్నేహితులు’ కథ పేరే ఈ పుస్తకానికి పెట్టింది. మిత్రుడి బద్దకాన్ని పోగొట్టడానికి మరో ముగ్గురు మిత్రులు వేసిన పథకం పన్నాగమే ఇందులోని అంశం. అప్పుడప్పుడే రచనలు చేయడం ప్రారంభించిన ఒక పాఠశాల విద్యార్థిని రాస్తున్న ఈ కథలను చదివితే మనకు చేయితిరిగిన రచయితో, బాల సాహితీవేత్తో రాశాడనుకుంటాం. ‘ఆడపిల్ల’ కథ చిరంజీవి శ్రీలతకు మహిళల విద్య, సాధికారికతలపై వున్న నమ్మకానికి, ఆలోచనలకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇందులోని అమ్మాయిని ఆడపిల్ల అని సర్కారు బడిలో చదివిస్తారు. అబ్బాయికి అన్ని వసతులున్న పెద్ద పాఠశాలలో చదివిస్తారు. చివరకు ఆడపిల్లే అన్నింట్లో ముందు నిలిచి తల్లితండ్రులకు ఆసరా అవుతుంది. పిల్లలు బొమ్మలను చేసి విజయం సాధించడాన్ని ఒక కథలో చెబితే మరో కథలో ‘ఐకమత్యం’తో ఉండి గెలుపొందిన కుక్కల గురించి చెబుతుంది. పర్యావరణం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు దాని ప్రాధాన్యతను తెలిపే విధంగా రాసిన కథ ‘పరిసరాల పరిశుభ్రత’. జాతీయ జండా గురించి కూడా కథ రాసింది శ్రీలత తన కథల సంపుటిలో. ఉదీయమాన దశలోనే చక్కని వస్తువులు, అంతకు మించిన పరిశీలన ఆలోచనలతో రాసిన శ్రీలత తన కథా ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో పెద్దపల్లి జిల్లా నుండి మరో రచయిత్రి వెలుగుతుంది. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్
9966229548