Monday, January 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా చేతిలోకి వెనిజులా చమురు ఆదాయం

అమెరికా చేతిలోకి వెనిజులా చమురు ఆదాయం

- Advertisement -

– ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం
– వెల్లడించిన శ్వేతసౌధం
వాషింగ్టన్‌ :
వెనిజులా చమురు అమ్మకాల ద్వారా వచ్చిన, అమెరికాలో నిల్వ ఉన్న నిధులను తమ నియంత్రణలో ఉంచుకునేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ఎగ్జిక్యుటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశాడు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్‌ తెలిపింది. వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్‌ మదురోను తప్పించి, ఆయనను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ట్రంప్‌.. ఈ ఎగ్జిక్యుటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేయడం గమనార్హం. శుక్రవారం సంతకం చేసిన ఈ ఆర్డర్‌ ద్వారా వెనిజులా విస్తారమైన చమురు వనరులను వినియోగించుకోవడం అమెరికా లక్ష్యాల్లో ఒకటని ట్రంప్‌ స్పష్టంగా చూపించారని వైట్‌హౌజ్‌ విడుదల చేసిన వివరణ పత్రం (ఫ్యాక్ట్‌ షీట్‌) పేర్కొన్నది. ఇది అమెరికా విదేశాంగా విధాన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకున్న చర్యగా వివరించింది.
కాగా ఈ నిర్ణయానికి ముందు డోనాల్డ్‌ ట్రంప్‌.. ప్రముఖ చమురు కంపెనీ అధిపతులతో సమావేశమయ్యారు. వెనిజులాలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అయితే ట్రంప్‌ నిర్వహించిన ఆ సమావేశానికి మాత్రం మిశ్రమ స్పందన లభించింది. 2007లో అప్పటి వెనిజులా అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ చమురు ప్రాజెక్టుల్లో ప్రభుత్వానికి మెజారిటీ నియంత్రణ ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో ఎక్సాన్‌ మొబిల్‌, కొనోకో ఫిలిప్స్‌ వెనిజులా నుంచి నిష్క్రమించాయి. తమకు వెనిజులా ప్రభుత్వం బాకీ ఉన్న బిలియన్‌ డాలర్లను తిరిగి పొందేందుకు అవి ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నాయి. ”అమెరికా ఖజానా శాఖ ఖాతాల్లో ఉన్న వెనిజులా చమురు ఆదాయాన్ని కోర్టులు లేదా రుణదాతలు స్వాధీనం చేసుకోకుండా కాపాడేందుకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాం” అని వైజ్‌హౌజ్‌ ఫ్యాక్ట్‌షీట్‌ పేర్కొన్నది. దీనర్థం, ఈ డబ్బును ప్రత్యేక రక్షణ కింద ఉంచి, కోర్టులు లేదా అప్పులిచ్చినవారు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకోవడమే ఈ ఎగ్జిక్యుటీవ్‌ ఆర్డర్‌ ఉద్దేశం. ఇది అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి అవసరమని ఆ ఆదేశంలో పేర్కొన్నారు. ”వెనిజులా చమురు ఆదాయాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల, వెనిజులాలో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం తీసుకురావాలన్న అమెరికా ప్రయత్నాలు దెబ్బతింటాయి. అందుకే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు” అని వైట్‌ హౌజ్‌ వెల్లడించింది. ఒప్పందం చేసుకుంటే సరి.. లేదంటే అంతుచూస్తాం అని క్యూబాకు ట్రంప్‌ హెచ్చరిక చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -