Wednesday, May 7, 2025
Homeరాష్ట్రీయంవెంకటేశ్‌ ప్రసాద్‌ నియామకం చెల్లదు : హైకోర్టు

వెంకటేశ్‌ ప్రసాద్‌ నియామకం చెల్లదు : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
క్రికెట్‌ ఆపరేషన్స్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా భారత మాజీ క్రికెటర్‌ బీకే.వెంకటేశ్‌ ప్రసాద్‌, కోచ్‌, స్టాఫ్‌ నియామకం చెల్లదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 10 మంది నియామకాలను పక్కకు పెట్టింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(హెచ్‌సీఏఈ) రూల్స్‌కు వ్యతిరేకంగా హెచ్‌సీఏ నియామకాలు చేసిందంటూ హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు సర్దార్‌ దల్జీత్‌సింగ్‌, జాయింట్‌ సెక్రటరీ టి.బసవరాజు ఇతరులు హైకోర్టులో సవాల్‌ చేశారు. హెచ్‌సీఏ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయనీ, వాటిని నిలిపివేయాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే పలువురితో ఒప్పందం కుదుర్చుకున్నారనీ, ప్రసాద్‌కు ఏటా రూ.75 లక్షల వేతనం ఇచ్చేలా అగ్రిమెంట్‌ చేసుకున్నారని ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారణ పూర్తి చేసి, వెంకటేశ్‌ప్రసాద్‌, హిమానీ యాదవ్‌, మమత, అర్జున్‌, రాజశేఖర్‌ తదితరుల నియామకాలు చెల్లవని ఉత్తర్వులు జారీ చేశారు. వారికి హెచ్‌సీఏ నుంచి చెల్లించిన గౌరవ వేతనాన్ని నియామకానికి బాధ్యులైన హెచ్‌సీఏ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, ఈసీవో వ్యక్తిగత ఖాతాల నుంచి రికవరీ చేయాలని హెచ్‌సీఏను ఆదేశించారు.
ప్రయివేటు కళాశాలలకు సెలవులు అమలు చేయాలి : హైకోర్టులో పిల్‌ దాఖలు
స్టేట్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన వార్షిక క్యాలెండ్‌లో పేర్కొన్న విధంగా ప్రయివేటు కళాశాలల్లో సెలవు దినాలు అమలు చేసేలా ఆఫీసర్లకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన బందెల క్రాంతికుమార్‌ అనే వ్యక్తి వేసిన పిల్‌ను బుధవారం హైకోర్టు విచారణ చేసే అవకాశముంది. ఆదివారాలు, పండుగలు, ఇతర సెలవు దినాల్లో ఫిజికల్‌, వర్చువల్‌ విధానంలో ప్రయివేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు ఒత్తిడికి గురై అనారోగ్యాల పాలవుతున్నారనీ, ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని పొందుపర్చారు. తనిఖీలు చేయాల్సిన సంబంధిత ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదనీ, కొందరు అధికారులు ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలకు మద్దతుగా ఉంటున్నారని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -