– దుకాణాల కేటాయింపు తీర్పునకు లోబడి ఉంటాయి
– రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు డైరెక్షన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లిక్కర్ షాపుల అప్లికేషన్ల గడువును ఈ నెల 18 నుంచి 23వ తేదీకి మార్పు చేయడాన్ని సవాలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో శనివారం వాదనలు, ప్రతివాదనలు పూర్తయ్యాయి. తీర్పును తరువాత ప్రకటిస్తామని జస్టిస్ తుకారంజీ చెప్పారు. సోమవారంలోగా ఇరుపక్షాలు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించారు. తాము తీర్పు చెప్పేలోగా ప్రభుత్వం లిక్కర్ షాపులను కేటాయిస్తే ఆ కేటాయింపులు హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటాయన్నారు. ఇదే సమయంలో గడువు పెంపు, షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగింపును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలను జారీ చేసేందుకు నిరాకరించారు. లిక్కర్ దుకాణాల అప్లికేషన్లను డ్రా తీయవచ్చనీ, లైసెన్స్‌ల కేటాయింపు మాత్రం తీర్పు మేరకే ఉంటుందని అన్నారు. లిక్కర్ షాపుల కోసం అప్లికేషన్ల సమర్పణ గడువు పొడగింపును హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన డీ.వెంకటేశ్వరరావు ఇతరులు హైకోర్టులో సవాలు చేశారు. గడువు పెంచుతూ ఎక్సైజ్ శాఖ జారీ చేసిన మెమోను కొట్టివేయాలని సీనియర్ అడ్వకేట్ దేశారు అవినాష్ వాదించారు. రూల్స్ ప్రకారం గడువు పెంపు చెల్లదన్నారు. ఇదే తరహా తీర్పు ఏపీ హైకోర్టు ఇచ్చిందన్నారు. ఏపీలో బార్ కోసం నిర్ణయించిన తేదీని పొడిగించడాన్ని రద్దు చేసిందన్నారు. ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 2025-27కు సంబంధించి 2,620 మద్యం దుకాణాల నిర్వహణ కోసం ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్‌ను గత ఆగస్టు 20న జారీ చేసిందన్నారు. తొలుత ఈ నెల18 వరకు నిర్ణయించిన దరఖాస్తుల గడువును 23 వరకు పెంచడం చెల్లదన్నారు. ఈ నెల 23న జరగాల్సిన షాపుల ఎంపిక డ్రాను 27వ తేదీకి వాయిదా వేసిందని వివరించారు. గడువు పొడిగింపుతో పోటీ పెరగడంతో మద్యం దుకాణాలు పొందే అవకాశాలు తగ్గాయన్నారు. మొదట మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దాదాపు 90 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలుగా ఉండేదనీ, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచిందన్నారు. దరఖాస్తుల గడువు పెంపు నిర్ణయం రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టంలోని నిబంధన 12(5)లకు విరుద్ధమన్నారు. ఆదాయం పెంపు కోసం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దరఖాస్తు చేసే గడువు పెంపు చేయరాదన్నారు. గడువు పెంపు చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ఫ్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ స్టే ఇవ్వొద్దని కోరారు. లిక్కర్ షాపుల కోసం ఆహ్వానించిన దరఖాస్తుల గడువును పెంచే అధికారం ఎక్సైజ్ శాఖకు ఉందన్నారు. నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమేనని చెప్పారు. ఈ నెల 18న బంద్ జరగడం, టెక్నికల్ సమస్యలు రావడం వల్ల అదే తేదీతో ముగియాల్సిన గడువును 23 వరకు పొడిగించాల్సి వచ్చిందన్నారు. సర్కార్ విధాన నిర్ణయంలో జోక్యం వద్దనీ, స్టే ఇవ్వొద్దని కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మద్యం దుకాణాల కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందనీ, గడువు పెంపును మాత్రమే సవాలు చేశారని, గెజిట్‌ను కాదని, కాబట్టి స్టే ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 18 వరకు మద్యం దుకాణాల కోసం మొత్తం 89,343 దరఖాస్తులు వచ్చాయనీ, గడువు పెంపు తర్వాత వచ్చినవి కేవలం 5,793 మాత్రమేనని వివరించారు. గడువు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ఒకవేళ ఏమైనా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తే గడువు పెంచాక స్వీకరించిన 5,793 దరఖాస్తుదారులకే పరిమితం చేయాలన్నారు. ఇరు పక్షాల వాదనల తర్వాత గడువు పెంపుపై స్టే ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు. లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియను నిలిపివేసేందుకు కూడా నిరాకరిస్తూ తీర్పును వాయిదా వేశారు.
లిక్కర్ షాపుల అప్లికేషన్ల గడువు పెంపుపై తీర్పు వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



