Sunday, May 25, 2025

సిందూరం

- Advertisement -

వంటింట్లో తన పనుల్లో చాలా హడావుడిగా ఉంది లక్ష్మి. తను ఒక్కత్తే అన్ని పనులు చేసుకుంటున్నందున ఆమెకు సమ యం చాలదు.భర్త,కొడుకూ ఇద్దరు మగమహారాజులు. అది కావాలి, ఇది కావాలీ అని ఆర్డర్లు వేయడం తప్ప, ఆమెకు సహా యం చేయాలన్న ఆలోచన వాళ్లకి రాదు.
బాణిలో నూనెపోసి, పోపు పెట్టడానికి లక్ష్మి సిద్ధమవుతున్నది.
ఇంతలో కొడుకు బంటిగాడు వచ్చాడు.
”అమ్మా! నా రక్తంలో సిందూరం ఉంది చూడు!” అన్నాడు ఉత్సాహంగా.
”చెయ్యిచాపు బంటీ కోసి చూస్తాను!” అన్నది లక్ష్మి తన పనులు చేసుకుంటూనే.
బంటిగాడు భయపడి వాట్సప్‌ చూస్తున్న తండ్రి కమల్‌ దగ్గరకు పరిగెత్తాడు.
”డాడీ, నారక్తంలో సిందూరం ఉందంటే, అమ్మ చేయికోస్తా’ అంటున్నది! అని బంటిగాడు తండ్రికి ఫిర్యాదు చేశాడు.
”అంతమాట అన్నదా? మీ అమ్మ! పద సంగతేంటో చూద్దాం!” అంటూ తండ్రీ కొడుకులు వంటింట్లోకి దూసుకెళ్లారు.
”ఏంటే బంటిగాడు రక్తంలో సిందూరం ఉందంటే, చేయికోస్తా అన్నావంట! ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా. నా రక్తంలో కూడా సిందూరం ఉంది!” అంటూ కమల్‌ చేయి చాపి కొడుకు ముఖంలోకి గర్వంగా చూశాడు.
లక్ష్మి భర్త చెయ్యి గట్టిగా పట్టుకుని అటూఇటూ వెతుకుతున్నది.
”ఏమిటి అటూ, ఇటూ వెతుకుతున్నావు?” కమల్‌ కంగారుగా!అంటూనే చేయి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ లాభం లేదు! అది ఉడుం పట్టు.
”ఏం లేదు! ఇప్పుడే కూరలు కోసిన చాకు ఎక్కడో పెట్టాను! అది దొరికితే మీ చేతికి గాటుపెట్టి, మీ రక్తాన్ని టెస్ట్‌కి పంపుతాను. అప్పుడు మీ రక్తంలో సిందూరం ఉందో, లేదో, ఉంటే ఎంత మోతాదులో ఉందో తెలుస్తుంది!” అంటూనే లక్ష్మి వెతుకుతున్నది.
”నీ దుంపతెగ! ఏదో వాట్సప్‌లో చూసి ఉద్రేకపడి మాట వరసకు అంటే నిజంగానే రక్త పరీక్ష చేయిస్తావా?” అన్నాడు కమల్‌ పూడుకుపోయిన గొంతుతో.
”అందుకే మాటలు చెప్పేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి! నరాల్లో దేశభక్తి ఉందీ, రక్తంలో సిందూరం ఉందీ, గుండెల్లో ఫలానా ఆయన ఉన్నాడు!లాంటి మాటలు చెప్పొద్దు! ఏదైనా చెబితే చేసి చూపాలి!” అన్నది లక్ష్మి భర్త చేయి వదిలిపెట్టి.
”చెప్పాం గాబట్టే చేసి చూపెట్టాం! దాని పేరే ఆపరేషన్‌ సిందూర్‌!” అన్నాడు కమల్‌. కొడుకుతో సహా దూరంగా జరిగి.
”నెల రోజులైంది! అమాయకులు సిందూరం కోల్పోయి! కాని వారి నుదుటి సిందూరం తుడిచేసిన నలుగురిలో ఒక్కరినైనా పట్టుకున్నారా? కుదరకపోతే కాల్చిచంపారా? ఏం చేశారు?” నిలదీసింది లక్ష్మి.
”నీకు బొత్తిగా దేశభక్తి లేకుండా పోతుంది! పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాము. మసూద్‌ ఆజహార్‌ కుటుంబాన్ని లేపేశాం. ఇంకేం కావాలి” అన్నాడు కమల్‌ గర్వంగా.
”చేసిన వాటి గురించి కాదు, చెయ్యని వాటి గురించి మాట్లాడండి. ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న వారిలో ఒక్కడ్నీ పట్టుకోలేకపోయారు! వందేండ్లుగా అఖండ భారత్‌ సాధించేది అంటూ గప్పాలు కొట్టుతుంటిరి గదా! బంగారం లాంటి ఛాన్సు వస్తే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోకపోతిరి! దేశమంతా, ప్రతిపక్షాలతో సహా మీకు ఫుల్‌ సపోర్టు ఇచ్చారు! అయినా కాల్పుల విరమణ అంటూ వెనుతిరిగితిరి ఏం లాభం!” అన్నది లక్ష్మి.
”పాకిస్తాన్‌ను మోకాళ్లమీద నిలబెట్టాం! వాళ్లు మోకాళ్ల మీద నిలబడి, యుద్ధం విరమించండి బాబో అని అడుక్కుంటే, యుద్ధాన్ని విరమించాం! అయినా ఇది యుద్ధం కాదు! ఉగ్రవాదుల మీద దాడులు మాత్రమే! తర్వాత పాకిస్తాన్‌తో చర్చిస్తాం!” అన్నాడు కమల్‌.
లక్ష్మి పగలబడి నవ్వింది!
”ఎందుకు నవ్వుతున్నావ్‌!” అన్నాడు కమల్‌.
”నవ్వకేం చేయను!” మీరు కాల్పుల విరమణ చేశాం! అంటున్నారు కాని మన ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకముందే ”భారత్‌ పాక్‌ కాల్పులు విరమిస్తున్నారంటూ” ట్రంప్‌ ప్రకటన చేశారు! ఆయనకు చెప్పి కాల్పులు విరమించారా అని! దేశం తెలుసుకోవాలా నుకుంటుంది! నేషన్‌ వాంట్సు టు నో!” అన్నది లక్ష్మి.
అప్పుడెప్పుడో కురు సభలో తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? అని ద్రౌపది అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది! కమల్‌కి. ఏం చెప్పాలో తోచలేదు!
”నీవు పాకిస్తాన్‌కు సపోర్టు చేస్తున్నావు!” అన్నాడు ఆఖరికి.
మళ్లీ నవ్వింది లక్ష్మి.
”మీరు ఎదుటి వారికి సమాధానం చెప్పలేని స్థితిలోకి వస్తే చెప్పే ఆఖరిమాట ఇదే! నేను కాదు పాకిస్తాన్‌కు సపోర్టు చేసేది! మీ యూ ట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా! నేను ఇంట్లో మీకు ఆకలేస్తే వండి పెడుతున్నాను. బయట ఉద్యోగం చేస్తూ, భారతదేశ జీడీపీని పెంచుతున్నాను! పన్నులు కడుతూ ప్రభుత్వాలకు ఆదా యాలు సమకూర్చుతున్నాను! రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ మేరకు దేశంలో జరిగిన పరిణామాలపై మాట్లా డుతున్నాను. అయినా నేను పాకిస్తాన్‌ మద్దతుదారుది అంటారు. ఆ జ్యోతి మల్హోత్రా, వందేభారత్‌ ప్రారంభానికి వీఐపీ పాసు తీసుకుని వీడియో చేస్తుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్ర మాలకు యూట్యూబ్‌లో పెడుతుంది! ఆ తర్వాత పాకిస్తాన్‌ ఇంటలీజెన్స్‌ ఆఫీసర్లతో డిన్నర్‌ చేస్తుంది! ఉగ్రవాదుల కన్నా ముందే పహల్గాం వెళ్లి వీడియోలు చేస్తుంది! ఆ తర్వాతే పహ ల్గాంలో మన వారి సిందూరాన్ని ఉగ్రవాదులు తుడి చేస్తారు! అయినా ఆ మల్హోత్రా దేశభక్తురాలు, ఇంకా అమాయ కురాలు! వహ్వవా!” అన్నది లక్ష్మి.
బంటిగాడు తండ్రి చేయి విడిపించుకుని వచ్చి తల్లి చేయి పట్టుకున్నాడు.
కమల్‌కి ఏం చెప్పాలో తెలియడం లేదు!
”మోడీ బీజేపీకి ప్రధాని కాదు! ఈదేశానికి ప్రధాని. మన ప్రధాని ఎవరైనా సరే విదేశాలతో వ్యవహరించేటప్పుడు మన దేశ గౌరవాన్ని, ప్రతిష్టను నిలబెట్టాలి! మనశక్తిని చాటాలి!అదే మనమంతా కోరుకునేది! కాని గత నెలరోజులుగా అమెరికా ప్రెసిడెంట్‌, ఇండియాకి ప్రెసిడెంటులా మాట్లాడుతున్నాడు! భారత్‌, పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ట్రంప్‌ ప్రకటించాడు! అమెరికా సరుకులపై ఇండియా టారిఫ్‌ విధించడం లేదని ఆయనే ప్రకటించాడు. భారత్‌లో ఆపిల్‌ ఉత్పత్తి చేయవద్దనీ ఆయనే చెప్పాడు! ఈ మూడింటిలో ఏం చెప్పినా మన ప్రధానే చెప్పాలి! కాని ట్రంప్‌ చెబుతుంటే నోరెత్తి మాట్లాడలేదు! ఇంత శక్తివంతుడైనా ప్రధాని గతంలో ఎప్పుడూ లేడని, 2014లో స్వాతంత్య్రం వచ్చిందని, విశ్వగురు అని మీరంతా ప్రచారం చేస్తారు కదా! మరేమైంది ఇప్పుడు? మన అంతర్గత వ్యవహారంలో ట్రంప్‌ జోక్యం చేసుకుంటుంటే మన ఆర్థిక విధా నాలను ఆయనే శాసిస్తుంటే, మన సైన్యం ఎప్పుడు కాల్పులు జరపాలో, విరమించాలో అమెరికా ప్రెసిడెంట్‌ ప్రక టిస్తుంటే, భరతమాత తిరిగి దాస్యంలోకి వెళ్తున్నదనే మేము బాధపడు తున్నాం! మీరు ఇంకా భ్రమల్లోనే బతుకుతుంటే భరించలేక పోతున్నాం!” అన్నది లక్ష్మి.
”అమ్మలాంటివారే, భారతమ్మ నుదిట సిందూరాలు!” అన్నాడు బంటిగాడు. – ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -