Sunday, July 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉపరాష్ట్రపతి:అపశ్రుతి,ఉపశ్రుతి

ఉపరాష్ట్రపతి:అపశ్రుతి,ఉపశ్రుతి

- Advertisement -

జగదీప్‌ ధన్కర్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి త్వరగా ఎన్నికలు జరపటానికి ఎన్నికల సంఘం రాజ్యసభ కార్యదర్శిని బాధ్యుడిగా నియమించింది. రాజ్యాంగం 63వ అధికరణం ఉపరాష్ట్రపతి గురించి, 68వ అధికరణం ఆ ఎన్నిక గురించి చెబుతున్నాయి. అయితే రాష్ట్రపతి విషయంలో ఆరు మాసాల్లోగా ఎన్నికలు పూర్తి చేయాలని చెబుతున్న రాజ్యాంగం ఉపరాష్ట్రపతి విషయంలో సాధ్యమైనంత త్వరగా(ఎఎస్‌ఎపి) అని మాత్రమే చెబుతోంది. జూలై 21వ తేదీ రాత్రి అనూహ్యంగా రాష్ట్రపతి భవన్‌కి వెళ్లి రాజీనామా సమర్పించిన ధన్కర్‌ అంతే వేగంగా నిష్క్రమించారు. తన రాజీనామా పై ఎవరైనా సంప్రదిస్తారని ఆయన వేసుకున్న అంచనాలు కూడా ఫలించలేదని చెబుతారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నానని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు తప్ప దానిపై విచారం కనిపించలేదు. ఆఖరుకు రాజ్యసభలో లాంఛనంగా వీడ్కోలు కూడా లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ వీడ్కోలు ప్రతిపాదించినా, విందు ఇవ్వాలని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. తాము విందు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనకు సహజంగానే ధన్కర్‌ స్పందించలేదు. వీటన్నిటిని బట్టి ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లోనే, విభేదాలతోనే హఠాత్తుగా నిష్క్రమించారని, అయినా అధికారపక్షానికి ఇబ్బంది కలిగించే పనులేవి చేయదలుచుకోలేదని స్పష్టమవుతుంది. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై వాస్తవాలేంటో చెప్పడానికి ఆయన సిద్ధం కాలేదు. గతంలో జనతాదళ్‌ తరపున రాజస్థాన్‌ శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్‌లో కూడా పనిచేసి బీజేపీలోకి మారిన ధన్కర్‌ బెంగాల్‌ గవర్నర్‌గా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ముఖాముఖి తలపడ్డమే కాక ప్రత్యక్షదాడికిి కూడా దిగారు. 2022లో ఉపరాష్ట్రపతి అయ్యాక రాజ్యసభ చైర్మన్‌గా ప్రతి కీలక సందర్భంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోసారు. కేంద్ర మంత్రులను మించి ప్రతి పక్షంపై విరుచుకుపడ్డారు మణిపూర్‌ సంక్షోభంపై, పార్లమెంటు భద్రతకు భంగం పై చర్చ చేయాలనే ప్రతిపక్షాలు ఎంత పట్టుబడిన ఒప్పుకోలేదు. మొండిగా నిరాకరించారు. కుస్తీ క్రీడాకారిణి విగేష్‌ పోగాట్‌పై దౌర్జన్యం జరిగినప్పుడూ చర్చకు నిరాకరించడమే కాక ‘మీరు ఒక్కరే మహిళా పక్షం కాదని’ ప్రతిపక్షాలపై దాడిచేశారు. మోడీని ప్రశంసలతో ముంచెత్తడమే కాక తాను ఆరెస్సెస్‌ ఏకలవ్య శిష్యుడిని అని కూడా ప్రకటించుకున్నారు. జగదీప్‌ధన్కర్‌ మరింతగా పేరు మోసింది న్యాయవ్యవస్థపై దాడికిి. రాజ్యాంగ మౌలిక స్వభావమన్న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును కూడా ఆయన తప్పుపట్టారు. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తిట్టిపోశారు. ఇంతగా బీజేపీని కొమ్ముకాసిన వ్యక్తి నిర్లక్ష్యపూరితంగా నిష్క్రమించడం ఎందుకు సంభవించింది? అంతగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలే ఆయన్ను గురించి మాట్లాడాల్సిన పరిస్థితేమిటి? ఇదేదో ప్రతిపక్షాల అవకాశవాదమైనట్లు కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పడం సరైనదేనా?

గత అనుభవాలు
ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం రాజ్యాంగ నిబంధనలు, రాజకీయ వాస్తవాలు వాటి స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. ఉపరాష్ట్రపతి పదవి అలంకారప్రాయమే గాని చైర్మన్‌గా రాజ్యసభ నడిపించటం ఒక కీలక అంశం. మరణం వంటివి సంభవిస్తే, తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలను కూడా ఆ పదవిలో వారు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో వివి గిరి, బీడీ జట్టి ఆ విధంగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించారు. ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ హఠాత్తుగా మరణించడంతో ఎమర్జెన్సీ అనంతరం జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీడీ జట్టి అ బాధ్యతలు నిర్వహించారు. చాలా సందర్భాల్లో ఉప రాష్ట్రపతులుగా ఉన్నవారు తదుపరి రాష్ట్రపతులు గా ఏకగ్రీవంగానో ఎన్నికలను రావడం కూడా చూశాం. సర్వేపల్లి రాధాకష్ణన్‌, జకీర్‌ హుస్సేన్‌, వివి గిరి, ఆర్‌ వెంకట్రామన్‌, శంకర్‌ దయాళ్‌ శర్మ వంటివారే అలా అత్యున్నత పదవిలోకి వచ్చారు. ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్నవారు పరిపక్వతతో గౌరవంగా వ్యవహరించటం పరిపాటి. కొన్నిసార్లు ఒడిదుడుకులు వచ్చినా ప్రభుత్వాధి నేతలు సర్దుబాటు చేసుకునేవారు. నెహ్రూ హయాంలో రాధాకష్ణన్‌ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనపై ఎవరో కాంగ్రెస్‌ నాయకులు కొందరు విమర్శలు చేశారు. వాటిని నెహ్రూ ఖండించపోవటంపై ఆయన కొంత బాధపడినట్లు కథనాలు వచ్చాయి. కానీ నెహ్రూ మామూలు సంబంధాలు పాటించడమే కాక తన సమక్షంలో ఎవరు అలా అనలేదని చెప్పడం ద్వారా అపార్ధాలు తొలగించారు. శంకర్‌ దయాల్‌ శర్మ రాజ్యసభ నిర్వ హిస్తుండగా అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్‌ నాయకుల నిరసనలతో మనస్తాపానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అప్పుడు కూడా కేంద్ర పెద్దలు సర్దుబాటు చేయడమే కాక తర్వాత వామపక్షాల సహకారంతో ఆయన్ను రాష్ట్రపతిని కూడా చేశారు. ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో సంఫ్‌ు పరివార్‌ నేతలు బాబ్రీ మసీదు విధ్వంసానికి పాల్పడినప్పుడు ప్రధాని కన్నా ముందే తను స్పందించడం ద్వారా శర్మ ఆ పదవి గౌరవాన్ని కాపాడారు. వాజ్‌పేయి హయాంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న కష్ణకాంత్‌ను రాష్ట్రపతి చేస్తానని స్వయంగా ప్రతిపాదించి తర్వాత హఠాత్తుగా మార్పు చేయడంతో ఆయన మనస్తాపంతో అనారోగ్యానికి గురయ్యారు.( హఠాత్తుగా మరణించారు కూడా) అలీఅహ్మద్‌ అన్సారి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు సంఫ్‌ు పరివార్‌ మనుషులు ఆయనపై మతముద్రతో విషప్రచారం చేయడం తీవ్ర విమర్శ గురైంది. అయితే ఇవి చాలా వరకూ ఆ పదవిలో ఉన్నవారు గాక అధికార పక్షంలో వారు చేసిన తప్పులు. ధన్కర్‌ కథ అందుకు భిన్నం. మోడీ హయాంలో మిగిలిన అన్ని వ్యవస్థలా్లగ అత్యున్నతమైన రెండు వ్యవస్థలు కూడా ఆయన అభీష్టం ప్రకారమే నడవాల్సి వచ్చిందని అనుభవాలు చెబుతున్నాయి. వెంకయ్యనాయుడు ఒక దశలో మోడీ కన్నా సీనియర్‌ అయినప్పటికీ ఆ పదవిలో మాత్రం ఆనందించింది లేదంటారు. అభిమానులు ఎన్ని కథలు వదిలినా తనకు తదుపరి మిగిలిన అత్యున్నత పదవి దక్కింది లేదు. రాష్ట్రపతిగా పనిచేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు జమిలి ఎన్నికల నివేదిక పని అప్పగించి మోడీ తన మాటే శాసనమని తెలిసేలా చేశారు. పార్లమెంటు నూతన భవనాల ప్రారంభం సమ యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవకుండా అలక్ష్యం చేశారు. ఇప్పుడు దిగిపోయిన ధన్కర్‌ తనకు వంత పాడినంతకాలం ముందుకు నెట్టి కాస్త తేడా రాగానే కరివేపాకుల తీసి పడేశారు మోడీ. ఇంతకు వారికి తేడా ఏం వచ్చింది?

శ్రుతిమించిన అతి
ఎంత పెద్ద పదవిలోకి వచ్చినా అధికారదర్పంతో, అవకాశవాదంతో వ్యవహరించే నేతలకు శృంగభంగం అనివార్యమని జగదీప్‌ ధన్కర్‌ మరోసారి నిరూపించారు. వ్యక్తిగతంగా ఆయనకు పదవి పటాటోపం, దుందుడు కుతనం ఎక్కువ. స్వతహాగా ఆరెస్సెస్‌ నేపథ్యం లేని ఆయన వారిని మెప్పించడం కోసం శతిమించి వ్యవహరిస్తూ వచ్చారు. అలంకారప్రాయమైన ఈ పదవిని అతిశక్తివంతమైనదిగా భ్రమించి హద్దుమీరి వ్యవహరించారు లోక్‌ సభకు కొంత భిన్నంగా రాజ్యసభల్లో వ్యవహార సరళి ఉంటుంది. కానీ చాలాసార్లు ఆయన రాజ్యసభనే ఉద్రిక్తం కావడానికి కారకులయ్యారు. న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సమీక్షాధికారాన్ని కూడా సవాల్‌ చేశారు. ఇందుకు అధికారపక్షం నుంచి మద్దతు లభించడంతో మరీ రెచ్చిపోయారు. కిసాన్‌ పుత్ర అని, ఒకప్పుడు మోడీ తనను కొనియాడారు కనుక నిజంగానే తాను జాట్‌ నేపథ్యంతో రైతు నాయకుడిని అయిపోయానని భావించారు. రైతాంగ ఉద్యమంపై దాడిని అరికట్టలేదు. కానీ కేంద్ర వ్యవసాయ మంత్రికి ఆదేశ పూర్వక వ్యాఖ్యలు చేయ డం వివాదాస్పదమైంది. అందులోనూ బీజేపీలో బాగా సీనియర్‌ అయిన మూడుసార్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌చౌహాన్‌ను ఐ సి ఏఆర్‌ సమావేశాల సందర్భంగా బహిరంగంగా ఆధిక్షేపించటం పాలకపక్షానికి మింగుడు పడలేదు. న్యాయమూర్తుల నియామకాలు, సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలపై రాజకీయ విన్యాసాలు చేయవచ్చు కానీ నిరంతరం ప్రత్యక్షదాడి చేయడం సున్నితమైన సమస్యగా మారింది. జస్టిస్‌ వర్మ అవినీతిపౖౖె అభిశంసనకు ఏకాభిప్రాయం వచ్చినా తను ప్రత్యేకంగా చొరవ తీసుకోవటం నచ్చలేదు. ఆయన అభిశంసన తమ గొప్పతనంగా చూపించుకోవాలని వారు సంకల్పిస్తే తన సమక్షంలో జరగాలని ధన్కర్‌ కోరుకున్నారు. మోడీ సర్కార్‌కు ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రజాస్వామిక సంప్రదాయాలు ఏకోశాన లేవు. లోక్‌సభలో ప్రభుత్వమే ఈ తీర్మానం తేవాలి. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి ప్రసంగంతో మొదటి అడుగు పడటం మోడీ సర్కారు జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఆయన్ను తప్పించడంతో ఆ తీర్మానం ఇప్పుడు విలువలేనిదంటూ లోక్‌సభలోనే ప్రవేశపెడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అధ్యక్ష ఎన్నికల ఆలస్యం, అటు ఇటు కీలక నేతల బదలాయింపు రీత్యా కూడా ఈ పదవి ఖాళీ అయితే మంచిదని వారు వ్యూహం పన్నారు. ధన్కర్‌ చర్యలపై అభిశంసనకు కూడా సన్నాహాలు ప్రారంభించారు. తద్వారా రాజ్యాంగ వ్యవస్థలకు తల ఎగవేసే నేతలకు పాఠం చెప్పాలనేది ఇక్కడ ఉద్దేశం. ఎలాగూ దించేస్తారు కనుక తానే దిగిపోవడం పరువు కాపాడుకోవడంగా ఆయన భావించినట్టు కనిపిస్తుంది. రాజకీయ విధానాలు దేశ ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేని వ్యవహారమిది. దేశంలో రెండో పెద్ద రాజ్యాంగ పదవి పట్ల కూడా ఏకపక్షంగా వ్యవహరించటమే ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. అంతే తప్ప ఈ ఒక్క యాంటీ క్లైమాక్స్‌ని బట్టి ధన్కర్‌ అనుచిత్యాలు మటుమాయమైపోవు.

వాట్‌నెక్స్ట్‌?
తదుపరి ఆ పదవిలోకి వచ్చేవారు ఎవరన్నా ఊహగానాలు భిన్న కోణాలు మన ముందుకొస్తున్నాయి. బీహార్‌ ఎన్నికల రీత్యా ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను తప్పించడం కోసం ఇక్కడికి రప్పించవచ్చునని,ఏపీ ముఖ్యమంత్రి పదవిలోకి నారా లోకేష్‌ను తేవాలి కాబట్టి చంద్రబాబు నాయుడిని తీసుకురావచ్చునని రకరకాల కథనాలు విలయవిహారం చేస్తున్నాయి. పనిలో పనిగా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను చేయాలని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఓఉచిత సలహా ఇచ్చారు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే జెపి నడ్డాను కూర్చోబెట్టవచ్చునని, అసలు అందుకే ఈ సంక్షోభం సష్టించారని మరో కథనం. చిరంజీవి కావచ్చు అని మరో వీరాభిమాన శిబిరం వినోదం. తాడు బొంగరం లేని కథలు ఎన్ని ఉన్నా అంతిమంగా మోడీ, అమిత్‌షాల వ్యూహాలను, ఆర్‌ఎస్సెస్‌ నిర్దేశాలను బట్టి తుదినిర్ణయం ఉంటుంది. ఎన్డీయే భాగస్వాములకు ఎవరికి ఈ పదవినిచ్చే ఉద్దేశం లేదని బీజేపీ నుంచే ఉంటారని మాత్రం ఆ పార్టీ వర్గాలు స్పష్టంగా ప్రకటించాయి. గతంలో మోడీతో విభేదించి బయటికి పోయిన గోవిందాచార్య, కళ్యాణ్‌ సింగ్‌, సత్యపాల్‌ మాలిక్‌, యశ్వంత్‌ సిన్హా ,వెంకయ్య నాయుడు ఎవరికి పెద్ద ప్రాధాన్యత మిగలలేదు. మరోవైపున బయటి నుంచి వచ్చిన వలసనేతలకు పెద్ద బాధ్యతలివ్వడం ఏంటనే ఒక అసంతప్తి ఉండనే ఉంది. కాకపోతే ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, జ్యోతిరాధిత్య సిందియా, హేమంత్‌ బిశ్వశర్మ వంటి వారు చక్కగా కుదురుకున్నారు కూడా. ఈ లెక్కల మధ్య అటు బీజేపీ అధ్యక్ష పదవి, ఇటు ఉపరాష్ట్రపతి పదవి కూడా సంఫ్‌ు పరివార్‌కు విధేయత చాటుకున్న వారికే లభిస్తుందని గట్టిగా చెప్పొచ్చు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఉభయ సభల సభ్యులు మాత్రమే. ఎన్డీయే-బీజేపీలకు స్పష్ట మైన ఆధిక్యత ఉన్నది. అందుకే ఇది రాజకీయంగా పెద్ద సంచలనం ఉండకపోవచ్చు. కాకపోతే ప్రతిపక్షాలు, ముఖ్య ంగా ‘ఇండియా’ వేదిక ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటానది చూడవలసిందే. 75ఏండ్ల రిటైర్మెంట్‌ కథల తర్వాత కూడా బీజేపీలో నమో ఫార్ములానే పనిచేస్తున్నదని మాత్రం ధన్కడ్‌ ఏపిసోడ్‌ తేల్చివేసింది.
తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -