Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక

రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక

- Advertisement -

నేడు ప్రతిపక్ష ఎంపీలకు మాక్‌ పోలింగ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఉపరాష్ట్రపతి ఎన్నికకు రేపు (మంగళవారం) పోలింగ్‌ జరగనుంది. ఇందులో భాగంగా నేడు (సోమవారం) ప్రతిపక్ష ఎంపీలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం ప్రతిపక్ష ఎంపీలకు వివరించనున్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో ‘మాక్‌ పోల్‌’ నిర్వహిస్తారు. రాత్రి 7:30 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. సెప్టెంబర్‌ 9న జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌, ఇండియా బ్లాక్‌ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్‌ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ జరగనుంది. ఈసారి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులూ దక్షిణ భారతదేశానికి చెందినవారే కావటం గమనార్హం. తమిళనాడు నుంచి రాధాకృష్ణన్‌, తెలంగాణ నుంచి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను ప్రతిపక్షాలు సైద్ధాంతిక యుద్ధంగా పేర్కొన్న విషయం విదితమే.
బీజేపీ రెండు రోజుల వర్క్‌షాప్‌
బీజేపీ తన ఎంపీలతో రెండ్రోజుల పాటు నిర్వహించే వర్క్‌షాప్‌ ఆదివారంనాడిక్కడ ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌ ప్రారంభం కాగానే.. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని మోడీని సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు. తొలి రోజు ఆదివారం ఈ వర్క్‌షాప్‌లో 2027 నాటికి అభివృద్ధి దిశగా భారత్‌, సోషల్‌ మీడియాను ఎంపీలు సమర్థవంతంగా వినియోగించడం.. ఈ రెండు ప్రధాన అంశాలపై చర్చించారు. అలాగే వ్యవసాయం, రక్షణ, ఇంధనం, విద్య, రైల్వేలు తదితర కమిటీలతో ఈ ఎంపీలు సమావేశం కానున్నారు. రెండో రోజు సోమవారం జరిగే వర్క్‌ షాప్‌లో ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎంపీలకు వివరించి, మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు.
రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌
ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ పిసి మోడీ మాట్లాడుతూ మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లోని వసుధలోని రూమ్‌ నెంబర్‌ ఎఫ్‌-101లో పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్‌ 9న ఉదయం 10 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ”ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాత వెంటనే ఫలితం ప్రకటిస్తారు” అని రాజ్యసభ సెక్రెటేరియట్‌ తెలిపింది. పార్లమెంట్‌ హౌస్‌లో పోలింగ్‌ ఏర్పాట్లను ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ పిసి మోడీ చేస్తున్నారని వివరించింది. ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్‌ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్‌ 12 మంది సభ్యులు, లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఉంటారు. ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 788 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం 781 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అభ్యర్థులిద్దరూ దక్షిణాదివారే
సి.పి రాధాకృష్ణన్‌ తమిళనాడుకు చెందిన బీజేపీ నేత. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. 2011 జులైలో సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన సుదర్శన్‌ రెడ్డి (79) నల్లధనం కేసుల దర్యాప్తులో అలసత్వం చూపినందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక మైలురాయి తీర్పులకు ప్రసిద్ధి చెందిన అనుభవజ్ఞుడైన న్యాయనిపుణుడు. మావోయిస్టులతో పోరాడటానికి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నియమించిన సల్వా జుడుమ్‌ను కూడా ఆయన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విదేశాల్లోని బ్యాంకు ఖాతాల్లో చట్టవిరుద్ధంగా దాచిన లెక్కల్లో లేని డబ్బును తిరిగి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని రెడ్డి ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad