Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబాధితుల్ని తక్షణమే ఆదుకోవాలి

బాధితుల్ని తక్షణమే ఆదుకోవాలి

- Advertisement -

– కిష్త్వార్‌ ఘటనపై తరిగామి తీవ్ర విచారం
– మానవ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు
– సున్నితమైన జమ్మూకాశ్మీర్‌ పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
శ్రీనగర్‌ :
జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో గురువారం సంభవించిన వినాశకరమైన మేఘ విస్పోటన ఘటనలో ప్రాణనష్టంపై సీపీఐ(ఎం) నాయకులు, కుల్గాం ఎమ్మెల్యే ఎం. వై. తరిగామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల్ని తక్షణమే, సమన్వయంతో ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మానవ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం తరిగామి ఒక ప్రకటన విడుదల చేశారు. కిష్త్వార్‌ ఘటన ‘అందరికీ చాలా విచారకరమైన క్షణం’ అని అన్నారు. ‘ప్రభుత్వం ఆలస్యం చేయకుండా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలి. సహాయ చర్యలను వేగవంతం చేయాలి’ అని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం కావడం వలన వాతావరణ మార్పులకు త్వరగా ప్రభావానికి గురవుతుందని అన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌, నిర్లక్ష పూరితమైన పట్టణాభివృద్ధి నుంచి అటవీ నిర్మూలన, మన నీటి వనరులపై అశ్రద్ద.. వంటి అనేక కారణాల వల్ల జమ్మూకాశ్మీర్‌ యొక్క సున్నితమైన పర్యావరణం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా వాతావరణ మార్పుల ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు, మరికొన్ని ప్రాంతాల్లో వినాశకరమైన వరదలు, మేఘవిస్పోటనాలు ఏర్పడుతున్నాయని అన్నారు.జమ్మూకాశ్మీర్‌తో పాటు, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సంభవించిన ఇలాంటి విపత్తుల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి సంఘటనలు విధానరూపకర్తలు, ప్రభుత్వాలకు ‘మేల్కొలుపు పిలుపులు’ కావాలని తరిగామి తెలిపారు. ‘ఈ విషాదాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి విపత్తులతో ఎక్కువ నష్టాలు సంభవించే ముందే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రతిస్పందనలను అభివృద్ధి చేయాలి’ అని సూచించారు.ఇటీవల సంవత్సరాల్లో జమ్మూకాశ్మీర్‌లో మేఘవిస్పోటనాల సంఘటనలు పెరిగాయని, గత కొన్ని నెలల్లోనే అనేక జిల్లాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయని అన్నారు. ‘ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌ పర్యావరణ విపత్తు అంచున ఉంది. సున్నితమైన పర్యావరణ వ్యవస్థను, సహజ వనరులను కాపాడుకోవడానికి మనం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే.. మన వర్తమానం మాత్రమే కాదు.. రాబోయే తరాల భవిష్యత్తు కూడా ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉంది’ అని తరిగామి తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad