మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయండి
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో.. ఉమ్మడి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం రూరల్
మున్సిపల్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యతతో కదిలి విజయం సాధించాలని, సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతి ఇంటి గడపనూ తట్టాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ పురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి అధ్యక్షతన ఆదివారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల క్షేత్రంలో పార్టీ జెండా రెపరెపలాడడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ ఉండటం సహజమని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. మనలో మనమే కొట్లాడుకుంటే మూడో వ్యక్తి గెలిచే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. నేతలు చొరవ తీసుకుని అభ్యర్థులందరినీ ఏకతాటిపైకి తేవడం అభినందనీయమన్నారు.
వార్డుకు ఒక్కరే అభ్యర్థి ఉండేలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారథ్యంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇదే ఊపుతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుని ఆయనకు కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభ్యర్థులందరికీ సోమవారం బీఫామ్‌లు అందజేస్తామని, అప్పటి నుంచే ముమ్మర ప్రచారం మొదలుపెట్టాలని సూచించారు. వార్డుల్లో ఘన విజయం సాధిస్తేనే మున్సిపల్ చైర్మెన్ పీఠం దక్కుతుందని, ఐక్యతతోనే అది సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులతో రూపొందించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, ఖమ్మం నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



