– గాంధేయ సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష : గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల్లో మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాంతియుత మార్గంతోనే విజయం సాధ్యమనీ, గాంధేయ సిద్ధాంతమే దేశానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఏర్పాటు చేసి 50 ఏండ్లు అవుతున్న సందర్భంగా గాంధీ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 1500 గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసి వారి త్యాగాన్ని, ఆలోచన విధానాన్ని దేశానికి సమాజానికి గుర్తు చేస్తున్నారని కొనియాడారు. గాంధీ బాటలోనే నడిచి నియంతలను, దుర్మార్గులను తరిమి కొట్టామన్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. అందులో భాగంగా జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మహనీయుల దారిలోనే నడిచి ప్రజలకు మేలు చేస్తామన్నారు. ఎప్పటికైనా శాంతి సామరస్యతే గెలుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, తదితరులు పాల్గొన్నారు.
శాంతియుత మార్గంతోనే విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES