కడుపుమండిన ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధిచెప్తారు
మహిళల్లో కౌన్ బనే కరోడ్‌పతి
ఆరు గ్యారంటీల అమల్లో రేవంత్‌రెడ్డి విఫలం
సైలెంట్‌గా కాదు వైలెంట్‌గానే ప్రజాతీర్పు
రెండేండ్లలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేని అసమర్థ ప్రభుత్వం
ఇంటింటికీ బాకీకార్డు సూపర్‌హిట్
హైడ్రా పెద్దలకు చుట్టం..పేదలకు శాపం
500 రోజుల్లో రాష్ట్రంలోనూ కేసీఆర్ ప్రభుత్వం
నవతెలంగాణతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ములాఖాత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. కడుపుమండిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని అన్నారు. సైలెంట్‌గా కాకుండా వైలెంట్‌గానే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ రెండేండ్లలో 40 లక్షల మంది కోటీశ్వరులు కావాల్సి ఉందన్నారు. మహిళల్లో కౌన్ బనే కరోడ్‌పతి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదన్నారు. ఈ రెండేండ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ఎలా సాగిందంటారు?
ఈ ఎన్నికల్లో మా ప్రచారం అద్భుతంగా జరిగింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అహర్నిషలు కష్టపడ్డారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఇక్కడే ఉండి పనిచేశారు. రోజూ ప్రజలను కలిసి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక చేసిన మోసం గురించి వివరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఎంత నష్టపోయారో పథకాల వారీగా చెప్పారు. ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నా ప్రజల తీర్పు మాత్రం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది. ప్రజల జీవితాలతో ముడిపడిన ఎన్నికలు కాబట్టి ఆలోచించి ఓటేయాలని కోరాం. మా ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మా సభలు, సమావేశాలకు, రోడ్ షోలకు విశేష ఆదరణ ఉన్నది. జూబ్లీహిల్స్ ఓటర్లు మరోసారి కారు గుర్తుకు ఓటేసీ మాగంటి సునీతను తప్పకుండా గెలిపిస్తారన్న నమ్మకముంది.
బీజేపీతో బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం వల్లే జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ గెలిచారనే ఆరోపణలున్నాయి. దీనిపై మీరేమంటారు?
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం నడుస్తున్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కుట్ర పన్నాయి. రేవంత్‌రెడ్డికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా బండి సంజయ్ సహాకారిగా ఉంటారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ దాడులు చేసింది. కానీ కేసు నమోదు చేయలేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాన్ని మేం వ్యతిరేకించాం. కానీ వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. బడేభాయ్ (మోడీ) దగ్గర మార్కులు కొట్టేయడానికి చోటేభారు (రేవంత్‌రెడ్డి) ఇలా చేశారు. రూ.రెండు కోట్ల ఆదాయం ఉన్న రేవంత్‌రెడ్డి అల్లుడి కంపెనీకి రూ.1,150 కోట్ల కాంట్రాక్టు దక్కింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1,300 కోట్ల కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రహస్యంగా అర్థరాత్రి కలిశారు. సీబీఐ మోడీ జేబు సంస్థ అని రాహుల్‌గాంధీ ఆరోపిస్తారు. కానీ ఇక్కడ కాళేశ్వరం కేసును రేవంత్‌రెడ్డి సీబీఐకి అప్పగించారు. దీన్ని బట్టి బీజేపీతో లోపాయికారి ఒప్పందం కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆరు గ్యారంటీల అమలు గురించి మీరు అడుగుతున్నారు.? గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ పథకం వంటివి అమలు చేయలేదు కదా?
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. రెండేండ్లు అవుతున్నా ఇంకా అమలు చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్ రూ.నాలుగు వేలు, వికలాంగుల పెన్షన్ రూ.ఆరు వేలకు పెంచుతామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు రూ.1,00,116తో పాటు తులం బంగారు ఇస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులను ఇస్తామని చెప్పింది. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.నాలుగు వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇవేవీ అమలు చేయలేదు. మా హయాంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు అప్రస్తుతం. అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజలు నమ్మి మోసపోయారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి.
కాంగ్రెస్ లేకుంటే ముస్లింలు లేరన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏమంటారు?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ఆవిర్భవించక ముందే ముస్లింలు స్వాతంత్య్రం కోసం ఉద్యమించారు. సీఎం స్థాయిలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైందికాదు.
మాగంటి సునీత మహిళ కాబట్టి ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండబోరన్న ప్రచారం జరుగుతున్నది? దీనిపై ఏమంటారు?
జూబ్లీహిల్స్‌ను ఆనుకుని తెలంగాణ భవన్ ఉన్నది. నాతో సహా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్‌గా మారింది. జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం ఈ ఎన్నికలపై ఏమైనా ప్రభావం పడుతుందంటారా?
కేసీఆర్ సందేశాన్ని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. ఆయనే మా బ్రహ్మాస్త్రం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలకు కూడా రాలేదు. ఆ ప్రభావం ఉండకపోవచ్చు. మేమంతా ఆయన సైనికులుగా పనిచేస్తున్నాం.
సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి జనం మొగ్గు చూపుతారు కదా?
అది అన్ని సార్లు ఉండదు. అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ప్రజలు ఆలోచించి ఓట్లు వేస్తారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండేండ్ల కాంగ్రెస్ పాలన గురించి కూడా ఆలోచన చేస్తారు. కేసీఆర్ పాలన బాగుందా?, రేవంత్‌రెడ్డి పాలన బాగుందా? అనేది కూడా చూస్తారు. కేసీఆర్ హయాంలో రూ.20 లక్షలు రూ.25 లక్షలు ఉన్న ఫ్లాట్ విలువ ఇప్పుడు రూ.15 లక్షలు, రూ.20 లక్షలకు పడిపోయింది. ఆస్తి పెరిగిందా? తగ్గిందా?అనేది ప్రజలు ఆలోచిస్తారు. అభివృద్ధి ఆగిపోయింది. ఆరుగ్యారంటీలు అమలు కావడం లేదు. కాంగ్రెస్ మోసం చేసిందన్న నైరాశ్యంలో ప్రజలున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
ఓటర్లు సైలెంట్‌గా ఉన్నారు. ఎవరికి ఓటేస్తారని భావిస్తున్నారు?
సైలెంట్‌గా కాదు వయొలెంట్‌గా ప్రజా తీర్పు ఉంటుంది. ఈనెల 14న బీఆర్‌ఎస్ గెలుపుతో మంచి సౌండ్ వినిపిస్తారు. అయితే కాంగ్రెస్ ఓట్లు దొంగతనం చేయడానికి సిద్ధమయ్యింది. దొంగ ఓట్లను చేర్పించింది. అవసరమైతే కొన్ని బూత్‌లలో రిగ్గింగ్ చేయడానికి వెనుకాడదు. ఆరు గ్యారంటీల గురించి బాకీ కార్డు పేరుతో ఇంటింటికీ తిరిగి ఇచ్చాం. అది సూపర్‌హిట్ అయ్యింది. రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా బాకీ కార్డును ఇంటింటికీ తీసుకెళ్తాం. కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేసే వారికి మేం అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం.
రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు?
రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. 2023 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచింది. 2025 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లలో 28 రాష్ట్రాలుంటే తెలంగాణ 28వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ఆదాయం తగ్గింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. లక్షలమంది ఉపాధి అవకాశాలను కోల్పోయా రు. హైడ్రా పేరుతో అరాచకం సాగుతున్నది. ప్రజలు కడుపు మంటతో ఉన్నారు. రేవంత్‌రెడ్డి, తమ్ముళ్లు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.ఆరు వేల కోట్లుంటే కేసీఆర్ ప్రభుత్వం 2023 నాటికి దాన్ని రూ.18 వేల కోట్లకు పెంచింది. ఈ రెండేండ్లలో రేవంత్ ప్రభుత్వం ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ఆదాయాన్ని రూ.25 వేల కోట్లకు పెంచేది. ఉద్యోగులు డీఏ, పీఆర్సీలు అడిగితే నన్ను కోసినా పైస లేదన్నారు. ప్రయివేటు కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులకు పాల్పడుతున్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయం వ్యాపారుల్లో ఉందంటారా?
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పట్ల వ్యాపారులు, ప్రజలు భయపడుతున్నారు. వ్యాపారాలు, చిరు వ్యాపారాలు దెబ్బతింటాయి. హైదరాబాద్‌లో 1,491 గుర్తించిన మురికివాడలున్నాయి. అందులో జూబ్లీహిల్స్ పరిధిలోనే సుమారు 500 వరకు ఉన్నాయి. కాంగ్రెస్ గెలిస్తే ఇంటికి బుల్డోజర్ వస్తుందని ప్రజలు కూడా భయపడుతున్నారు. అందుకే రౌడీషీటర్లకు, హైడ్రాకు, రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి.



